మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్​కు

మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్​కు

షహీనా అత్తర్​వాలా. జీవితం తనముందు నిలిపిన ఎన్నో సవాళ్లను, అడ్డంకులను  దాటుకుని ముంబయి స్లమ్స్​ నుంచి మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం వరకు ఎదిగింది. ముంబయి స్లమ్స్​ నుంచి మైక్రోసాఫ్ట్​ జాబ్​ వరకు అంటూ ఆమె షేర్​ చేసుకున్న  ట్విట్టర్​స్టోరీ గత రెండురోజులుగా వైరల్​ అవుతోంది. అడ్డంకులను దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆమె స్టోరీ ఎందరికో ఇన్​స్పిరేషన్​. ఆ స్టోరీ గురించి...

‘‘మా నాన్న వీధి వ్యాపారి (హాకర్)​. దానివల్ల రోడ్ల మీద నిద్రపోవాల్సి వచ్చేది. ఉత్తరప్రదేశ్​ నుంచి ముంబయికి జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాడు.  జీవితం గడిచేందుకు ఎసెన్షియల్​ ఆయిల్స్​ అమ్మేవాడు. నా బాల్యంలో ఎక్కువ భాగం బాంద్రా రైల్వేస్టేషన్​ దగ్గర ఉండే దర్గా గల్లి స్లమ్​లో గడిచింది. స్కూల్లో చదువుకునేటప్పటినుంచే కంప్యూటర్లు అంటే విపరీతమైన ఇష్టం నాకు. కానీ నాకొచ్చే మార్కులతో కంప్యూటర్​ క్లాసులకు వెళ్లడం కుదర్లేదు. దాంతో నన్ను కుట్టుపని నేర్చుకోమన్నారు. ఒకపక్క అది నేర్చుకుంటూనే నా కల నెరవేర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశా. అప్పుచేసి నాకు కంప్యూటర్​ కోర్సు నేర్పించమని మా నాన్నని బలవంతపెట్టడం అందులో ఒకటి. ఎలాగైతేనేం ఒక కంప్యూటర్​ క్లాసులో  చేర్చాడు. అక్కడ ప్రోగ్రామింగ్​లో బేసిక్స్​ నేర్చుకున్నా. అది నేర్చుకునేటప్పుడే డిజైన్​ను కెరీర్​గా మార్చుకోవాలి అనుకున్నా” అని తన కెరీర్​ జర్నీ గురించి చెప్పిన షహీనా​ అత్తర్​వాలా ముంబయి యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసింది. తరువాత విజువల్​ కమ్యూనికేషన్స్​ అండ్​ డిజైన్​లో ఎన్​ఐఐటి నుంచి డిప్లొమా అందుకుంది. కొంతకాలం బెంగళూరులో జూమ్​కార్​ కంపెనీలో యుఎక్స్​ డిజైన్​ లీడర్​గా చేసింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్​లో డిజైన్​ లీడర్​గా పనిచేస్తోంది. 

స్లమ్​ లైఫ్​ పవర్​ఫుల్​
ఈ జర్నీ అంతటిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటున్న షహీన స్లమ్​ లైఫ్​ గురించి చెప్తూ “స్లమ్​లో జీవితం గడపడం చాలా కష్టం. చాలా భయంకరమైన పరిస్థితులను నాకు పరిచయం చేసింది. నాకప్పుడు ఏడేండ్లు. ప్రతీరోజూ ఉదయం ఒక బకెట్​ నిండా నీళ్లు పట్టుకుని, పబ్లిక్​ టాయిలెట్​కు వెళ్లేదాన్ని.  బకెట్​కు ఉన్న సన్నటి హ్యాండిల్​ వల్ల చేతివేళ్లు నొప్పి పుట్టేవి. దాంతో బకెట్​ సరిగ్గా పట్టుకోలేక, బాత్​రూమ్​ దగ్గరకు వెళ్లేలోపు చాలా నీళ్లు కిందపోయేవి. అప్పడే ఏదైనా చేయాలనిపించింది. నూనె డబ్బాను రౌండ్​గా కట్​ చేశా. దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ అయింది. నీళ్లు కూడా కిందపోలేదు. మా పక్కింటివాళ్లు నేను తయారుచేసిన ప్లాస్టిక్​ కంటెయినర్​ను వాడడం మొదలుపెట్టారు. నా దగ్గర ఉన్న తక్కువ రిసోర్స్​ వాడి నలుగురికీ ఉపయోగపడేలా చేయగలననిపించింది. అలాగే స్లమ్​లో ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్న ఆడామగా తేడా, అబ్బాయిల వేధింపులే నా జీవితాన్ని డిఫరెంట్​గా దిద్దుకోవాలన్న ఆసక్తికి ఎనర్జీ ఇచ్చాయి. ప్రోగ్రామింగ్​ నేర్చుకున్న నేను దాన్ని వదిలేసి డిజైన్​లో కెరీర్​ డెవలప్​ చేసుకోవాలి అనుకున్నా. మారుతున్న పరిస్థితులకు టెక్నాలజీ మెయిన్​ టూల్​ అవుతుంది అనిపించడమే అందుకు కారణం. 

2015లో స్లమ్​ను వదిలి నా జీవితానికి పునాది వేసుకునేందుకు అడుగు బయటపెట్టాను.  కొన్నేళ్ల కష్టం తరువాత నా కల ఫలించింది. ఇరుకుగా ఉండే మురికివాడ నుంచి విశాలమైన అపార్ట్​మెంట్​లోకి మారాను.  ఇప్పుడు మా కుటుంబమంతా ఆకాశాన్ని చూడగలుగుతున్నాం. గాలి, వెలుతురు ఫ్లాట్​లోకి వస్తోంది. పచ్చని చెట్లను చూస్తూ, పక్షుల కువకువలను వింటున్నాం” అని నవ్వుతూ చెప్పింది.

నెట్​ఫ్లిక్స్​ సిరీస్​ ‘బ్యాడ్​ బాయ్​​ బిలియనీర్​లో చూపించిన స్లమ్​లోని ఒక ఇంట్లో మేం ఉండేవాళ్లం. ఇండియాలో నాలాగా కొన్ని లక్షల కుటుంబాలు  పేదరికంలో మగ్గిపోతున్నాయి. వాటిని మీరు చూసి ఉండకపోవచ్చు. కానీ వాళ్లందరిలో ఒక ఆశ ఉంది. అదేంటంటే... ఓ మాదిరి చదువుకున్న వాళ్లు ఎవరైనా మా హక్కుల గురించి అధికారంలో ఉన్న వాళ్లని అడుగుతారని. జీవితాల్లో మార్పు తెస్తారని. ఇండియాలో పేదవాడు తమ సమస్య గురించి మాట్లాడితే మీరు కన్విన్స్​ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఒక స్లమ్​ లేదా పల్లెలోనో కొన్ని రోజులు ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీకు అసలు విషయం తెలుస్తుంది. బతకడం ఎంత కష్టమో..!