తల్లి కూలీ.. తండ్రి హమాలీ.. కొడుకు జూనియర్​ సివిల్​ జడ్జి

తల్లి కూలీ.. తండ్రి హమాలీ.. కొడుకు జూనియర్​ సివిల్​ జడ్జి
  • జగిత్యాల మండలం హస్నాబాద్  గ్రామానికి చెందిన పట్నం నరేశ్​ విజయగాథ

జగిత్యాల, వెలుగు: తల్లి వ్యవసాయ కూలీ.. తండ్రి హమాలీగా 25 ఏండ్లుగా పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక పార్ట్  టైం జాబ్స్  చేసిన పట్నం నరేశ్  తాజాగా వెలువడ్డ జూనియర్  సివిల్  జడ్జి ఫలితాల్లో జడ్జిగా ఎంపికయ్యాడు. జగిత్యాల మండలం హస్నాబాద్  గ్రామానికి చెందిన కనకయ్య, యాదవ్వ దంపతులది  నిరుపేద కుటుంబం. అదే గ్రామంలో అద్దెకు ఉంటూ కుటుంబాన్ని పోషించకుంటూనే, కొడుకు చదువు కోసం కూలీ పని, హమాలీ పని చేస్తూ కష్టపడి పని చేశారు. వీరికి నలుగురు సంతానం. ఓ కూతురు పెళ్లైనప్పటికీ, కొడుకును ఉన్నత చదువులు చదివించాలని తపనపడ్డారు. లాసెట్ లో మంచి ర్యాంక్  రావడంతో 2017లో హైదరాబాద్  అంబేద్కర్  కాలేజీలో పట్నం నరేశ్  సీటు సాధించి ఎల్ఎల్బీ పట్టా పొందాడు. 

2024లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్  రావడంతో ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పార్ట్  టైం జాబ్స్  చేసుకుంటూ సివిల్  జడ్జ్  ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో గత నెల 30న ప్రకటించిన జూనియర్  సివిల్  జడ్జ్  ఫలితాల్లో న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కష్టానికి ఫలితం దక్కిందని, తమ కొడుకు ఉన్నత స్థానానికి ఎదిగి ప్రశంశలు అందుకుంటున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.