ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే.. ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది ఓవర్‌నైట్ స్టార్ డమ్ తీసుకొచ్చేస్తోంది. మ్యూజిక్ వీడియోలైతే మళ్లీ మరో పాట వచ్చేవరకు ఆ సంగీతం చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. క్షణాల్లో వైరల్ అయి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. భాషతో సంబంధం లేకుండా మ్యూజిక్ లవర్స్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ట్రెండింగ్ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. ఆ పేరే ‘సాయి అభ్యంకర్’. కేవలం ఇరవై ఏళ్ల ప్రాయంలోనే గ్లోబల్ లెవల్ చార్ట్ బస్టర్స్ అందిస్తూ, ఇండీ మ్యూజిక్ వాల్యూను పెంచిన ఈ మల్టీ టాలెంటెడ్ సాయి.. ఇన్స్పైరింగ్ జర్నీ ఇది.
సాయి అభ్యంకర్ 2004 నవంబర్ 4న చెన్నైలో జన్మించాడు. ఇతనికి సంగీతం పుట్టుకతోనే అబ్బింది. తండ్రి టిప్పు దక్షిణ భారతదేశంలో ప్రముఖ గాయకుడు. తల్లి హరిణి కూడా లెజెండరీ సింగర్. తాతయ్య శ్రీనివాసన్ ప్రసిద్ధ ఘట విద్వాంసులు. ఇలా ఇంట్లో ఎటు చూసినా సప్తస్వరాల సవ్వడి వినిపించేది. అటువంటి వాతావరణంలో పెరిగిన సాయికి చిన్నతనం నుంచే లయ మీద పట్టు చిక్కింది. అయితే, ప్రముఖుల పిల్లలు అనగానే అన్నీ ఈజీగా దొరుకుతాయని అందరూ అనుకుంటారు. కానీ సాయి విషయంలో అలా జరగలేదు. తల్లిదండ్రుల పేరు వాడుకుని అవకాశాలు అందుకోవడం ఇతనికి అస్సలు ఇష్టం లేదు. తన టాలెంట్ చూసి మాత్రమే ప్రపంచం గుర్తించాలని పట్టుదలతో ఉండేవాడు. ఆ పట్టుదలే ఇతన్ని నేడు ఒక సెన్సేషన్‌గా మార్చింది.
మల్టీ టాలెంటెడ్
సాయి అభ్యంకర్ కేవలం సింగర్ మాత్రమే కాదు. ఇతను ఒక అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్, ప్రోగ్రామర్, మల్టీ ఇన్‌స్ట్రుమెంటలిస్ట్. ఎనిమిదేళ్ల వయసు నుంచే కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాడు. తండ్రి టిప్పు దగ్గర గాత్రంలోని మెళకువలు తెలుసుకుంటూనే, మరోవైపు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ మీద ఫోకస్ చేశాడు. ఒకే సమయంలో పదికి పైగా వాయిద్యాలను ప్లే చేయగల కెపాసిటీ సాయి సొంతం. పియానో వాయించడంలో దిట్ట. అలాగే గిటార్, డ్రమ్స్, తబలా, మృదంగం వంటి ఇన్స్ట్రుమెంట్స్ను అవలీలగా హ్యాండిల్ చేస్తాడు. ఈ జ్ఞానమే ఇతని పాటల్లో విభిన్నమైన సౌండ్స్ వినిపించడానికి కారణం. తన స్టూడియోలో గంటల తరబడి కూర్చుని కొత్త రకమైన ట్యూన్స్ కనిపెట్టడం సాయికి ఎంతో ఇష్టమైన పని.
నిరూపించుకోవాలనే తపన
సాయి ప్రయాణంలో సక్సెస్‌ల కంటే ముందు ఎన్నో ఏళ్ల నిశబ్ద పోరాటం ఉంది. 2024లో ‘కచ్చి సేరా’ పాటతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. దానికి ముందువరకు తన గదిలోనే ఉండి వేల గంటల పాటు మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాడు. ‘టిప్పు గారి అబ్బాయి’ అనే ముద్రను చెరిపేసి, ‘సాయి అభ్యంకర్’ అనే గుర్తింపు తెచ్చుకోవడం ఒక పెద్ద సవాలుగా అతని ముందు నిలిచింది. సంప్రదాయ సంగీతాన్ని నేటి తరం కోరుకునే పాప్ మ్యూజిక్‌తో కలపడం (ఫ్యూజన్) అంత ఈజీ కాదు. ఆ మిశ్రమాన్ని పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి ఎన్నో విఫల ప్రయోగాలు చేశాడు. తన పాటలను మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తనను తాను నిరూపించుకోవాలనే తపనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తన స్వరాన్ని ప్రజలకు నేరుగా వినిపించాలని ప్రయత్నం చేశాడు.
గ్లోబల్ సక్సెస్
2024 సాయి అభ్యంకర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘కచ్చి సేరా’ పాట సంగీత ప్రపంచంలో పెను తుఫానులా మారింది. ఆ పాటలోని బీట్స్, సాయి పాడిన విధానం యూత్‌కు విపరీతంగా నచ్చేశాయి. యూట్యూబ్‌లో ఈ పాటకు కేవలం కొన్ని నెలల్లోనే 250 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్పాటిఫై వంటి గ్లోబల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ మీద టాప్ ర్యాంక్స్‌లో నిలిచింది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో సైతం ఈ పాటకి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడం విశేషం. దీని తర్వాత వచ్చిన ‘ఆసా కూడా’ పాట మరో సంచలనం. తన సోదరి సాయి స్మృతితో కలిసి పాడిన ఈ మెలోడీ సాంగ్ యూత్‌కి ఒక డ్రీమ్ సాంగ్‌లా మారిపోయింది. ఈ రెండు పాటలతో సాయి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
సక్సెస్ సీక్రెట్
సాయి అభ్యంకర్ సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ‘కాలానుగుణంగా మారడం’. నేటి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో సాయికి బాగా తెలుసు. చాలా సింపుల్ గా ఉంటూనే, వినడానికి హాయిగా ఉండే ట్యూన్స్ కంపోజ్ చేయడం తన స్పెషాలిటీ. తన సంగీతంలో లోకల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తాడు. నిజంగా సాయి అభ్యంకర్ జర్నీ నేటి యువతకు గ్రేట్ ఇన్స్పిరేషన్. మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, కష్టపడకుండా ఏదీ రాదని నిరూపించాడు. కేవలం గాయకుడిగానే కాకుండా ఒక గొప్ప సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు.
సినిమా అవకాశాల వెల్లువ
ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా వచ్చిన గుర్తింపు సాయికి సినిమా పరిశ్రమలో రెడ్ కార్పెట్ వేసింది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ సినిమా కోసం సాయి అభ్యంకర్ అదిరిపోయే పాటలు అందించాడు. అందులో ‘బూమ్ బూమ్’, ‘నీ గుండెలోన’, ‘బాగుండు పో’ వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇతను సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో సంగీతం అందించే గొప్ప అవకాశం దక్కింది. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సాయి కెరీర్‌కు మైలురాయిగా నిలవనుంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘బెంజ్’ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లుఅర్జున్ నటిస్తోన్న ‘రాకా’కు సైన్ చేశాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని పాటల కంపోజింగ్ పూర్తయ్యిందని, ఇవి అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని సాయి చెప్పాడు. ఈ ఆల్బమ్ కోసం విదేశీ సింగర్స్, లిరిక్ రైటర్స్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపాడు. అంతేకాదు తన దగ్గర ఇప్పటికే వెయ్యికి పైగా పాటలు సిద్ధంగా ఉన్నాయని, అయితే పెద్ద సినిమాల కోసం ఎప్పటికప్పుడు కొత్తగా బాణీలు కడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

