ORS కొంటున్నారా..? ఇక ఆ భయం అక్కర్లేదు.. ‘ఓఆర్ఎస్’ పేరు దుర్వినియోగానికి చెక్

ORS కొంటున్నారా..? ఇక ఆ భయం అక్కర్లేదు.. ‘ఓఆర్ఎస్’ పేరు దుర్వినియోగానికి చెక్

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వాణిజ్య పానీయాల మార్కెట్‌‌ను కమ్మేసిన ప్రమాదకరమైన గందర గోళానికి తెరదించింది. ఇటీవల రాష్ట్రాలకు కీలక ఆదేశం జారీ చేసింది. సాధారణ ఆరోగ్య పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ తయారీదారులు తమ లేబుళ్లపై వినియోగిస్తున్న ‘ఓఆర్​ఎస్’​ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) అనే పదాన్ని తక్షణమే తొలగించాలని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ  స్పష్టం చేసింది. ఈ ఆదేశం కేవలం లేబుల్‌ మార్పు కాదు. ప్రజారోగ్య రక్షణలో ఇది ఒక చారిత్రక, అత్యవసరమైన  ముందడుగుగా పరిగణించాలి.

‘ఓఆర్ఎస్’ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ
(డబ్లూహెచ్ఓ) నిర్దేశించిన  ప్రమాణాలకు అనుగుణంగా, వైద్యపరంగా ధృవీకరించబడిన అత్యంత కీలకమైన జీవరక్షక ఔషధం. ఇది గ్లూకోజ్,  సోడియం క్లోరైడ్,  పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ వంటి కీలక లవణాల మిశ్రమంతో కూడిన నోటి పానీయపు పొడి. దీనిని నీటిలో కరిగించిన తర్వాత, విరేచనాల కారణంగా ఏర్పడే  డీహైడ్రేషన్ నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కచ్చితమైన మిశ్రమం శరీరం కోల్పోయిన కీలక ఎలక్ట్రోలైట్‌‌‌లను తిరిగి అందించి, చిన్న పిల్లల్లో సహా ఎవరికైనా ప్రాణాపాయం రాకుండా కాపాడే ఒక వైద్యపరమైన చికిత్స. ఇది కేవలం శక్తినిచ్చే పానీయం కాదు. 

అయితే, గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో ‘ఓఆర్​ఎస్’ పేరు దుర్వినియోగం అవుతోంది. అనేక వాణిజ్య సంస్థలు తాము ఉత్పత్తి చేసే సాధారణ పండ్ల రసాలు లేదా అధిక చక్కెర శాతం ఉన్న క్రీడా పానీయాలకు ‘ఓఆర్​ఎస్’ లేదా ‘ఓఆర్​ఎస్​ లాంటి’ అనే లేబుళ్లను జత చేశాయి. దీనివల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు, లేదా సరైన అవగాహన లేని పట్టణ ప్రజలు... తీవ్రమైన అనారోగ్యం, నిర్జలీకరణం సంభవించినప్పుడు, అసలైన, ప్రమాణీకరించిన ఓఆర్ఎస్ కిట్ల బదులు ఈ వాణిజ్య, చక్కెర అధికంగా ఉన్న పానీయాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.

మోసపూరిత మార్కెటింగ్
నిజమైన ఓఆర్​ఎస్​లో ఉండాల్సిన కీలక లవణాల నిష్పత్తి ఈ  కమర్షియల్ డ్రింక్స్‌‌‌‌‌‌‌‌లో ఉండదు. పైగా, వీటిలోని అధిక చక్కెర కంటెంట్ కొన్నిసార్లు విరేచనాల తీవ్రతను మరింత పెంచి, నిర్జలీకరణాన్ని తగ్గించడానికి బదులు పెంచే ప్రమాదం ఉంది. వైద్యపరంగా అత్యవసరమైన సమయంలో సరైన ఔషధం అందకపోవడం, దానికి బదులుగా నిరుపయోగమైన లేదా హానికరమైన పానీయం తీసుకోవడం అనేది ప్రజారోగ్యం పట్ల ఎంత పెద్ద నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. ఇది కంపెనీలు కేవలం తమ ఉత్పత్తి అమ్మకాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న దారుణమైన చర్య. ఈ వాణిజ్య పానీయాలలో సోడియం, పొటాషియం వంటి లవణాల నిష్పత్తి డబ్ల్యూహెచ్​ఓ  ప్రమాణాలకు అనుగుణంగా ఉండదు. దీనివల్ల శరీరం విషతుల్యం అయ్యే  ప్రమాదం ఉంది.

ముఖ్యంగా శిశువులు, పసిపిల్లలు తప్పుడు ఓఆర్​ఎస్​ వినియోగిస్తే, అది కిడ్నీలపై భారం పెంచి, కోలుకోలేని హానిని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలోనే, ఎఫ్ఎస్ఎస్ఏఐ కళ్లు తెరిచి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కేవలం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా  ఆమోదించిన ఫార్ములాను కలిగి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, కాస్మెటిక్స్ చట్టం పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు మాత్రమే ‘ఓఆర్​ఎస్’ అనే పేరును ఉపయోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆహార ఉత్పత్తులు, పానీయాలు తక్షణమే తమ లేబుళ్ల నుంచి ఈ పదాన్ని తొలగించాలి.

రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, అమలులో సవాళ్లు
ఎఫ్​ఎస్​ఎస్ఏఐ  ఈ  ఆదేశాలను అమలు చేసే బాధ్యతను రాష్ట్రాల ఆహార భద్రత కమిషనర్లకు అప్పగించింది. ఈ ఆదేశం వెలువడిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా వ్యవహరించాలి. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే ఉన్న నిల్వలను, కొత్తగా తయారవుతున్న ఉత్పత్తులను పర్యవేక్షించి, ‘ఓఆర్ఎస్’ పేరును దుర్వినియోగం చేస్తున్న కంపెనీలపై తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఒక నిర్దిష్ట గడువులోగా లేబుళ్లను మార్చని ఉత్పత్తులను మార్కెట్ నుంచి తొలగించడం ద్వారానే ఈ ఆదేశం స్ఫూర్తి పరిరక్షించడం అవుతుంది. ఈ సున్నితమైన అంశంపై ఇంతకాలం నియంత్రణ సంస్థలు ‘కళ్లు మూసుకుని’ కూర్చున్నాయా అనే తీవ్రమైన ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే, ‘ఓఆర్​ఎస్​’ వంటి అత్యంత సున్నితమైన, వైద్యపరమైన ప్రాధాన్యత కలిగిన పేరును ఆహార, పానీయాల విభాగంలో ఉపయోగించడానికి అనుమతించడం ప్రారంభంలోనే జరిగిన పెద్ద పొరపాటు. ప్రైవేట్ కంపెనీల ఆర్థిక ప్రయోజనాల కంటే, పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో 

నియంత్రణ సంస్థలు మరింత చురుకుగా, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కేవలం దుకాణాలపై జరిమానాలు విధించడమే కాకుండా, పెద్ద ఎత్తున వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు, టీవీ,  పత్రికా ప్రకటనల ద్వారా సరైన ఓఆర్​ఎస్​ ను ఎలా గుర్తించాలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ పదేపదే హెచ్చరించినప్పటికీ, వారు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్సులను రద్దు చేసే స్థాయికి చర్యలు ఉండాలి.

ఈ కఠిన నిర్ణయం భారతీయ జనారోగ్య వ్యవస్థకు ఒక శుభ పరిణామం. ప్రజలు కూడా ఓఆర్​ఎస్​ అంటే కేవలం ఎలక్ట్రోలైట్ డ్రింక్ కాదని, అది వైద్యపరమైన ప్రామాణికత కలిగిన ఔషధమని గుర్తించాలి. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఆదేశం లక్ష్యం నెరవేరాలంటే, రాష్ట్ర ప్రభుత్వాల పటిష్టమైన అమలుతో పాటు, వినియోగదారుల అవగాహన అత్యవసరం. ఓఆర్​ఎస్​ లేబుల్‌‌‌‌‌‌‌‌ను చూసినప్పుడు, అది కేవలం వైద్య నిపుణుల సలహా మేరకు ఎంచుకోవాల్సిన ‘జీవరక్షక ఔషధమే’ అని ప్రజలు తమ బాధ్యతగా గుర్తించి తీరాలి.  ఆ  నిఘానే ఈ చారిత్రక నిర్ణయానికి అసలు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

డా.కట్కూరి, సైబర్ సెక్యురిటీ & న్యాయ నిపుణుడు