మరోసారి నిత్యావసరాల రేట్లు పెరిగే చాన్స్

మరోసారి నిత్యావసరాల రేట్లు పెరిగే చాన్స్
  • నిత్యావసరాల రేట్లు పెరిగే చాన్స్‌‌
  • టీవీలు, ఫ్రిజ్‌‌ల ధరలు కూడా
  • గత 3 రోజుల్లో 50 పైసలు

కోల్‌‌‌‌కతా/ముంబైఇది వరకే అధిక ధరలతో సతమతమవుతున్న కస్టమర్‌‌‌‌పై భారం మోపడానికి ఫాస్ట్‌‌‌‌ మూవబుల్‌‌‌‌ కన్జూమర్‌‌‌‌ గూడ్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎంసీజీ) కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లు, ముడిసరుకుల ధరలు బాగా పెరిగినందున, తమకు వేరే మార్గం లేదని చెబుతున్నాయి. సబ్బులు, పేస్టులు, బిస్కెట్ల వంటి ఎఫ్‌‌‌‌ఎంసీజీ వస్తువులతోపాటు టీవీలు, ఫ్రిజ్‌‌‌‌ల వంటి ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువుల ధరలు కూడా వచ్చే నెల నుంచి పెరగవచ్చని ఇండస్ట్రీవర్గాలు తెలిపాయి. గోధుమలు, వంటనూనెలు, చక్కెర ధరలు 20 శాతం వరకు పెరిగాయి కాబట్టే ఆ మేరకు రేట్లను కూడా పెంచాల్సి వస్తోందని నెస్లే, పార్లే, ఐటీసీ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్‌‌‌‌, పాల ధరలు కూడా గతవారమే పెరిగిన విషయాన్ని ఇవి గుర్తుచేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ధరలను పెంచడానికి బదులు ప్యాక్‌‌‌‌ల సైజును తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నాయి. కరెంటు పొదుపునకు ఉద్దేశించిన రూల్స్‌‌‌‌ను ప్రభుత్వం మరింత కఠినంగా మార్చింది. కొత్త రూల్స్‌‌‌‌కు తగ్గట్టుగా ఫ్రిజ్‌‌‌‌ కంప్రెసర్లు, టీవీ ప్యానెళ్లను తయారు చేయడానికి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా ఈ భారం కస్టమర్‌‌‌‌కే బదిలీకాక తప్పదని కన్జూమర్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ కంపెనీలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టీవీ ప్యానెళ్ల ధరలు 17 శాతం వరకు పెరిగినందున, కొత్త సంవత్సరం నుంచి ఇండియాలోనూ టీవీల ధరలు మారవచ్చని అంటున్నారు.

పెరిగిన ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లు

బిస్కెట్లు, ఇన్‌‌‌‌స్టంట్‌‌‌‌ నూడుల్స్‌‌‌‌, మిక్చర్‌‌‌‌ వంటి స్నాక్స్‌‌‌‌, ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌, కేక్స్‌‌‌‌, రెడీ టు ఈట్‌‌‌‌ మీల్స్‌‌‌‌ వంటి ప్యాకేజ్డ్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ తయారు చేసే కంపెనీలు కూడా ముడిసరుకుల ధరల భారంతో ఇబ్బందిపడుతున్నాయి.  ప్రజలకు మరోసారి ధరల షాక్‌‌‌‌ తప్పకపోవచ్చని మార్కెట్‌‌‌‌ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం గత నెల ఏకంగా ఆరేళ్ల గరిష్టం 11 శాతానికి చేరింది. తమ వస్తువుల ధరల పెంపుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని, మిగతా కంపెనీలు ఇదే బాటలో నడవొచ్చని ఐటీసీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌   సుమంత్‌‌‌‌ అన్నారు. ‘‘ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లు చాలా పెరిగాయి. మామూలుగా అయితే ఇతర ఖర్చులను తగ్గించుకొని ధరలను యథావిధిగా ఉంచుతాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపునకు మొగ్గుచూపుతాం. మరీ ఎక్కువగా రేట్లు పెంచితే అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉంటుంది’’ అని నెస్లే ఇండియా చైర్మన్‌‌‌‌ సురేశ్‌‌‌‌ నారాయణ్‌‌‌‌ వివరించారు. ముడిసరుకులు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు,  జీతాలను ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లుగా పిలుస్తారు.

పాల ధరలూ ప్రియమే

మనదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌‌ గత వారం నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ లీటరు పాల ధరను రూ.రెండు వరకు పెంచింది. మదర్‌‌ డెయిరీ లీటరు పాల ధరను రూ.మూడు పెంచింది. ఇన్‌‌పుట్‌‌ కాస్ట్‌‌లు పెరిగినప్పటికీ, ఇటీవల కేంద్రం కార్పొరేట్‌‌ ట్యాక్సులను తగ్గించడంతో కంపెనీలపై భారం కొద్దిగా తగ్గిందని పార్లే ప్రొడక్ట్స్‌‌ కేటగిరీ హెడ్‌‌ మయాంక్‌‌ షా అన్నారు. వస్తువుల ద్రవ్యోల్బణం ఇలాగే పెరిగితే, ధరల పెంపు మినహా వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ప్రముఖ ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌‌ యూనిలీవర్‌‌ గత క్వార్టర్‌‌లో కొన్ని సబ్బుల ధరలు తగ్గించగా, వాటికి డిమాండ్‌‌ పెరిగింది. సబ్బుల తయారీలో ముఖ్య వస్తువు అయిన పామాయిల్‌‌ ధరలు ప్రస్తుతం మూడేళ్ల గరిష్టానికి పెరగడంతో వీటి తయారీ కంపెనీల లాభాలు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.