
- నాటుకోళ్లకు మస్తు గిరాకీ
- ఫారం కోళ్ల కంటే ఊరు కోళ్లనే కాయిష్ చేస్తున్న జనం
- హైదరాబాద్ సిటీ శివారుల్లో 500 పౌల్ట్రీల్లో జోరుగా పెంపకం
- నాటుకోడి చికెన్ వాడకం.. మేజర్ వాటా బోనాల సీజన్‌దే
- రాష్ట్రంలో 8 వేల ఫాంలలో 1.75 లక్షల కోళ్ల సంరక్షణ
హైదరాబాద్, వెలుగు: బోనాల సీజన్ స్టార్ట్ అయింది. అమ్మవార్లకు బోనం సమర్పించే భక్తులు స్తోమతను బట్టి వీలైతే యాటలను లేదంటే నాటు కోళ్లను ఎదురిచ్చి కోస్తుంటరు. ఫారం కోళ్లతో పోలిస్తే నాటు కోళ్లనే ఎక్కువ కాయిష్జేస్తరు. రేట్ ఎక్కువైనా ఊరికోడిని కోసే మొక్కు చెల్లించుకుంటరు. దీంతో బోనాల సీజన్గిరాకీని దృష్టిలో పెట్టుకొని పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు నాటుకోళ్ల పెంపకం మీద నజర్ పెడుతున్నారు. గతంలో బాయిలర్, లేయర్ కోళ్లనే పెంచే చాలా మంది.. ఇప్పుడు వాటితో పాటు నాటుకోళ్లనూ సాదుతున్నరు. డిమాండ్‌ను బట్టి ఒక్కో ఫామ్‌లో వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెంచుతున్నరు. ఒక్కో నాటు కోడికి మామూలు రోజుల్లో కిలో ధర 350 నుంచి 450 పలికితే, బోనాల సీజన్లో ప్రాంతాన్ని బట్టి రూ.700 నుంచి1000 రూపాయల వరకు వస్తోంది. సిటీ శివారుల్లో 500 పౌల్ట్రీలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఫామ్‌లలో ఒక్కో దాంట్లో 500 నుంచి-1000 కోళ్లు పెంచుతున్నారు. గతంలో వీటిలో 60 శాతం బాయిలర్, 30 శాతం లేయర్, 10 శాతం మాత్రమే నాటు కోళ్లు పెంచే వాళ్లు. ఇపుడు 80 శాతం నాటు కోళ్లనే పెంచుతున్నారు. గుడ్ల కోసం డిమాండ్ఉండటంతో లేయర్లను పెంచుతున్నారు. బాయిలర్ల సంఖ్య ఈ సీజన్లో బాగా తక్కువ ఉంటుందని ఓనర్లు చెబుతున్నారు. పౌల్ట్రీల్లో నాటు కోళ్ల పెంపకానికి డిమాండ్పెరగడానికి కూడా ఓ కారణం ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో జనం ఇళ్ల వద్ద కోళ్లను పెంచేవాళ్లు. చికెన్ సెంటర్ఓనర్లు ఊర్ల నుంచి కోళ్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇపుడు చాలా మంది ఇళ్ల వద్ద కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో అక్కడి ప్రొడక్షన్లేక సప్లై పడిపోయింది. కానీ చికెన్‌సెంటర్ల వద్ద నాటు కోళ్లు అడిగే వాళ్ల సంఖ్య పెరిగింది. ఎంత రేటైనా పెట్టేందుకు జనం రెడీగా ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పౌల్ట్రీ నిర్వాహకులు దీన్ని లాభసాటి వ్యాపారంగా భావిస్తున్నారు.
కరోనా టైమ్ నుంచి మారిన సీన్..
కరోనా కాలంలో నాటు కోళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, నాటు కోళ్లు సహజ సిద్ధంగా పెరుగుతాయనీ, మంచి రుచి ఉంటుందని వాటి మీద ఇంట్రెస్ట్ చూపడం మొదలుపెట్టారు. అయితే, గతంలో ఊళ్లలో పెరిగే కోళ్లను కొని తెచ్చి చికెన్‌సెంటర్ల వద్ద వాటిని అమ్మేవాళ్లు. కిలో ధర కూడా బాయిలర్ కోడి కన్నా డబల్ రేటు ఉండేది. ఇప్పుడు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు రేటు నడుస్తోంది. డిమాండ్‌ను చూసి పౌల్ట్రీల ఓనర్లు నాటు కోళ్లు పెంచడం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల వరకు పౌల్ట్రీ ఫామ్‌లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి లక్షా 75 వేల నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. 2.31 టన్నుల నాటుకోడి మాంసాన్ని వినియోగిస్తే... ఇందులో మేజర్ వాటా ఈ సీజన్‌దే. ఇందులో 70 శాతం వాటా ఆషాఢ మాసంలోనే జరుగుతుందని పౌల్ట్రీల ఓనర్లు చెబుతున్నారు.
పెంచడానికి టైమ్ ఎక్కువ..
బాయిలర్లు, నాటు కోళ్లు పెంపకానికి మధ్య చాలా తేడా ఉంటుంది. బాయిలర్ కోళ్లు 45 రోజుల్లో పెరుగుతాయి. నాటు కోళ్లు పెంచేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది. డ్యూయల్ పర్పస్.. అంటే మాంసం, గుడ్ల కోసం పెంచే రత్నపురి రైడర్స్, మహారాష్ట్ర డీపీ, తమిళనాడు క్రాస్వెరైటీలు మూడు నెలల్లోపు పెరుగుతాయి. అయితే ఊర్లలో సహజ సిద్ధంగా పెరిగే నాటు కోళ్లకు, పౌల్ట్రీల్లో పెరిగే నాటు కోళ్లకు మధ్య తేడా ఉంటుంది. సిటీ శివార్లలోని కొన్ని సెంటర్లలో ఊరినాటు కోళ్లతోపాటు, పౌల్ట్రీ నాటుకోళ్లను విడివిడిగా అమ్ముతారు. కొందరు కోళ్లను చూడగానే గుర్తు పట్టేస్తారు. ఇంకొందరికి చికెన్ సెంటర్ల వాళ్లు తేడా చెబుతారు. పౌల్ట్రీ నాటుకోడి కన్నా, ఊరి నాటు కోడి ధర ఇంకా ఎక్కువ. రెండింటికి మధ్య రెండు మూడు వందల నుంచి ఒక్కో సందర్భంలో రెట్టింపు తేడా కూడా ఉంటుంది.
బగార బువ్వ, నాటు కోడి మాంసం..
బోనాల సీజన్లో అమ్మవార్లకు బెల్లం బువ్వ, శాకంతో బోనం సమర్పిస్తారు. సిటీలోని ప్రధాన ఆలయాల్లో జంతు బలిని నిషేధించిన కారణంగా భక్తులు వీటితోనే బోనం సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. కానీ ఇళ్ల సమీపంలో ఉండే అమ్మవారి గుడికి వెళ్లి కోడి లేదా యాటను సమర్పించి పక్కకు తెచ్చి కోస్తారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో నేరుగా గుడి వద్దే అమ్మ వార్లకు వీటిని సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. కోడి, మేక, గొర్రెలను సమర్పించి ఆ మాంసాన్ని ప్రసాదంగానే భావిస్తారు. తొలకరులు ఎంటరైన సమయంలో వచ్చే బోనాల సీజన్లో కోడి, మేక మాంసాలతోపాటు ఇళ్లల్లో చేసే బగారా బువ్వ కాంబినేషన్చాలా ఫేమస్. సిటీలో గోల్కొండలోని జగదాంబిక, లష్కర్‌లోని ఉజ్జయినీ మహంకాళీ, ఓల్డ్ సిటీలోని లాల్‌దర్వాజ మహంకాళీ, బల్కంపేట ఎల్లమ్మ గుడులల్లో ప్రధానంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో పై భాగంలో కొలువు తీరిన అమ్మవారికి శాకం(వెజ్) బోనం సమర్పించి, కొద్దిగా కిందికి వచ్చి అక్కడ కోళ్లు, యాటలతో విందు భోజనాలు వండి కుటుంబ సభ్యులు బంధువులతో అక్కడే తిని ఇంటికి వస్తారు.
వెయ్యి కోళ్లు పెంచుతున్న..
షెడ్ లీజుకు తీసుకొని బాయిలర్ కోళ్లతో పాటు నాటు కోళ్లను పెంచుతున్న. ఈ సీజన్లో నాటు కోళ్లకు ఎక్కువ గిరాకీఉంటుంది. బోనాల జాతర కోసమని రెండునెలల క్రితమే వెయ్యి పిల్లలను తెచ్చి ఫామ్‌లో వేసిన. అవి ఇప్పుడు పెద్దగైనయి. ప్రస్తుతం నాటుకోడి రేటు కిలో రూ. 400 ఉంది.
- మేకల శ్యామ్ యాదవ్, పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకుడు, కప్రాయిపల్లి
గుడ్లకూ మంచి గిరాకీ..
ఏడాది నుంచి నాటుకోళ్ల పెంపకంపైనే ఇంట్రెస్ట్పెట్టిన. వాటి మాంసంతోపాటు గుడ్లకూ మంచి గిరాకీ వస్తోంది. గుడ్ల కోసం వచ్చే రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. పౌల్ట్రీ మొత్తం నాటుకోళ్లను పెంచాలని డిసైడ్అయిన. ప్రస్తుతం బాగానే గిట్టుబాటు అవుతోంది. వర్షాకాలం, బోనాల జాతర కోసం నాటుకోళ్లు రెడీగా ఉన్నయి.
- క్రిష్ణారెడ్డి, పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకుడు, ఇనాంగూడ, అబ్దుల్లాపూర్‌మెట్
ఇంటికాడనే సాదుతున్న..
నాటుకోళ్లకు డిమాండ్ బాగా పెరుగుతుండటంతో ఇంటివద్దనే వంద కోళ్లను పెంచుతున్న. నాటు కోడి గుడ్లు, మాంసం ఎక్కువ మంది జనం ఇష్టపడుతున్నారు. అందుకే ఫామ్‌లలో కాకుండా పల్లెల్లో పెంచే విధంగానే సాదుతున్న. రోజూ కోళ్లను బయటకు వదిలిపెట్టి సాయంత్రం రూముల తోలుతున్న.
- ధరమ్కార్ సురేశ్, హిమాయత్ సాగర్
పండుగల కోసం పెంచుతున్న
నాటుకోళ్ల ను ఓ ప్లాన్ ప్రకారం పెంచితే మంచి లాభాలు ఉంటాయి. బోనాలు, దసరా, డిసెంబర్ 31, సంక్రాంతి, హోలీ, టైంలో కోళ్లు చేతికొచ్చేలా చూడాలి. కోళ్లను పెంచడంలో10 శాతం కష్టం ఉంటే, మార్కెటింగ్ చేయడంలోనే 90 శాతం ఉంటది. ఈ సీజన్లలో నాటుకోళ్లకు రూ.500 నుంచి 650 వరకు ధర ఉండొచ్చు.
- అరుణ్‌క్రాంతి, జగిత్యాల