పింక్, బ్లాక్ సాల్ట్​కు ఫుల్ డిమాండ్

పింక్, బ్లాక్ సాల్ట్​కు ఫుల్ డిమాండ్
  • హర్యానా, పంజాబ్ నుంచి తీసుకొచ్చి రోడ్ల పక్కన విక్రయం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​సిటీలో రోడ్లపై విక్రయిస్తున్న పింక్(రాక్), బ్లాక్ సాల్ట్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇన్నాళ్లు సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్ లలోనే దొరికే ఈ సాల్ట్.. ఇప్పుడు రోడ్ల పక్కనా లభిస్తుండటంతో ఈ సాల్ట్ గురించి తెలిసిన వారు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రాళ్ల ముద్దలుగా కనిపిపస్తుండటంతో మరికొందరు సిటిజన్స్ ఇదేంటని అడిగి.. ఆ సాల్ట్ ప్రయోజనాలు తెలుసుకుంటున్నారు. నచ్చితే కొనుగోలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యాపారులు ఈ సాల్ట్ ను అక్కడి నుంచి తీసుకొచ్చి సిటీలో విక్రయిస్తున్నారు. దాదాపు 30 మంది 10 ట్రాక్టర్లలో వచ్చి సిటీలోని నాంపల్లి, మెహిదీపట్నం, ఉప్పల్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర  ప్రాంతాల్లో అమ్ముతున్నారు. గత నెలరోజులుగా ఈ సాల్ట్ విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో దగ్గర డెయిలీ 50 నుంచి 60 కిలోల సాల్ట్ అమ్ముతున్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. పాకిస్తాన్ లోని ఉప్పు గనుల  నుంచి పింక్, బ్లాక్ సాల్ట్ ఇండియాకి వస్తుందని, తాము పంజాబ్ నుంచి ఈ సాల్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.  పింక్ సాల్ట్ కిలో రూ.80 ఉండగా.. బ్లాక్ సాల్ట్ కిలో రూ.100 నుంచి 120 వరకు పలుకుతుంది.

పింక్ సాల్ట్ తో ఉపయోగాలు..

 పింక్ సాల్ట్  చూడడానికి సాధారణ రాళ్ల ఉప్పులాగే కనిపిస్తుంది. అయితే ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడమే. ఈ ఉప్పుకి ఉన్న రంగు కారణంగానే చాలామంది దీనిని పింక్ సాల్ట్ అని పిలుస్తారు. అలాగే ఇది హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి దీన్ని హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. సాధారణ ఉప్పుతో  పోల్చితే.. ఇందులో 98శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఖనిజ లవణాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియమే  కాకుండా ఎన్నో మినరల్స్  ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఎంతో మంచిదని, ఈ సాల్ట్ శరీరంలోనించి చెడు పదార్థాలను తొలగించి, నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని నిపుణులు అంటున్నారు.  

ఇవి శరీరంలోని సోడియం స్థాయిలని అదుపులో ఉంచి, అతిదాహం కాకుండా చేస్తాయని, రక్తపోటుని నియంత్రించడానికి, హార్మోన్ల స్థాయిలను సమతూకంలో ఉంచడానికి, అరుగుదలకీ పింక్ సాల్ట్ ఉపయోగపడుతుందని అంటున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ సాల్ట్ చాలా ఉపయోగమని వైద్యులు అంటున్నారు.

రేట్లు తక్కువే..

పింక్, బ్లాక్ సాల్ట్ రేట్లు సూపర్ మార్కెట్లతో పోలిస్తే రోడ్ సైడ్ లో చాలా తక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్లలో పింక్ సాల్ట్ కిలో క్వాలిటీని బట్టి రూ.300 నుంచి వెయ్యికిపైగా ఉంది. అలాగే బ్లాక్ సాల్ట్ రూ.400 నుంచి రూ.1500లకుపైనే ఉంది. అయితే ఇవన్నీ పౌడర్, చిన్న రాళ్ల రూపంలో లభిస్తాయి. కానీ ఇప్పుడు రోడ్ సైడ్ లో విక్రయిస్తున్న సాల్ట్ డైరెక్టుగా గనుల నుంచి తీసిన ముద్దలుగా విక్రయిస్తుండటం, ధరలు కూడా తక్కువగా ఉండటంతో కొనుగోలు చేసేం దుకు వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ రకం ఉప్పు ఎప్పటి నుంచో వినియోగంలో ఉన్నప్పటికీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు రోడ్ సైడ్ లో విక్రయిస్తుండటంతో అందరూ తెలుసుకుంటున్నారు.

నెలరోజుల నుంచి విక్రయిస్తున్నం

పంజాబ్, హర్యానా నుంచి ట్రాక్టర్లలో పింక్, బ్లాక్ సాల్ట్ తీసుకొచ్చి విక్రయిస్తున్నం. అక్కడి నుంచి తీసుకొని వస్తూ దేశ వ్యాప్తంగా అమ్ముతూ హైదరాబాద్ కు చేరుకున్నం. ఇక్కడ ఇంకొన్నాళ్లు విక్రయించిన తరువాత ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తాం. ఇక్కడ ఒక్కో దగ్గర డెయిలీ  50 నుంచి 60 కిలోల సాల్ట్ అమ్ముతున్న.  ఈ సాల్ట్ పాకిస్తాన్ లోని గనుల నుంచి వస్తుంది. ఆరోగ్యానికి ఈ సాల్ట్ ఎంతో మంచిది.
-అఖిల్ కుమార్, సిర్సా జిల్లా, హర్యానా