ఆకాశంలో అద్భుతం!

ఆకాశంలో అద్భుతం!

మరింత పెద్దగా, దగ్గరగా పెద్దన్న గురుడు.. జూన్‌ అంతా కనిపిస్తాడు

చీకటి నల్లగా ఉంటది కానీ, భూమిని సల్లగ జేస్తది.. ఆకాశాన్ని అద్భుతంగా చూపిస్తది. చుక్కల తళుక్కులు, చంద్రుడి చమక్కులతో మెరిపిస్తది. ఇప్పుడు జూన్​ మొత్తం అలాంటి ఆకాశ అద్భుతాలు మన కంట్ల పడితే ఎట్లుంటది? మస్తు ఉంటది కదా! ఈ నెలంతా గ్రహాలకు పెద్దన్న గురుడు రేత్రి మొత్తం కనిపిస్తడు. ఇప్పటి కన్నా పెద్దగైతడు. చిన్నోడు బుధుడు, ఏడోవాడు అంగారకుడు మనసు పడినట్టున్నరేమో పక్కపక్కకు వస్తున్నరు. వాటికి అదనంగా చందమామ వంకర్లు తిరుగుతడు. ఆ విశేషాలేంటో చెప్పింది నాసా. వాటిని చూసేద్దాం జూన్​ అంతా. అసలేం జరుగుతుందో, ఎట్ల సూడాల్నో తెలుసుకుందాం.

పెద్దన్న మరింత పెద్దగా
పొద్దుగూకే టైంలో సూర్యుడు అట్లపోవడం మొదలు.. పెద్దన్న గురుడు పైకొస్తడు. టెలిస్కోపులకు కనిపించే సైజు కన్నా మరింత పెద్దగైతడు. రాత్రి మొత్తం వెలిగిపోతడు. మామూలుగా ఆకాశంపై ఓ లుక్కేస్తే ఓ చుక్కలాగా కనిపిస్తాడు గానీ, బైనాక్యులర్​తోనో లేదంటే చిన్నపాటి టెలిస్కోపుతోనో చూస్తే అద్భుతంగా కనిపిస్తాడు. వాటితో చూస్తే గురుడి నాలుగు చందమామలూ కనిపిస్తాయి. అంతేకాదు, గురుడికే ప్రత్యేకమైన వంకలవంకల మేఘాలనూ చూసేయొచ్చు. ప్రస్తుతం గురుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన జూనో స్పేస్​క్రాఫ్ట్​ దాని చుట్టూ తిరుగుతున్నది కదా.. దానికైతే దాదాపు టచ్​ చేసినంత పనైతది. జూన్​ 10న భూమికి ఎదురుగా గురుడు వస్తాడు. ఏటా ఒక్కసారి మాత్రమే ఇది జరుగుతుంది. అంటే గురుడు, భూమి, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తారన్నమాట. గురుడు, సూర్యుడి మధ్య భూమి ఉంటుంది. ఏడాదిలో గురుడిని మంచిగా చూడాలంటే మాత్రం ఇదే కరెక్ట్​ టైం. ఎందుకంటే ఇప్పుడే గురుడు భూమికి మరింత దగ్గరగా వచ్చి పెద్దగా కనిపిస్తాడు.

మధ్యలో గాళ్లిద్దరూ
జూన్​ మధ్యలో అంగారకుడు (మార్స్​), బుధుడు (మెర్క్యురీ) ముచ్చట్లు చెప్పుకోబోతున్నాయి. ఆ రెండు గ్రహాలు  పక్కపక్కకు రాబోతున్నాయి. ఎప్పుడూ లేనంత దగ్గరకు వస్తున్నాయి. జూన్​ 17, 18న రెండు రోజుల పాటు సూర్యుడు వెళ్లిపోగానే సాయంత్రం ఆ రెండు కనిపిస్తాయి. ప్రపంచ పడమర ప్రాంతాల వాళ్లకు ఆ రెండు చాలా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకదానిపై ఒకటి ఉంటాయి. వాటి మధ్య కేవలం కొన్ని డిగ్రీల తేడా మాత్రమే ఉంటుంది. వాటిని పర్​ఫెక్ట్​గా చూడాలంటే పర్​ఫెక్ట్​ లొకేషన్​ను చూసుకోవాలి. ఉత్తరాది వాళ్లకు అవి రెండు స్పష్టంగా కనిపిస్తాయి. 14వ తేదీ నుంచి 19 వరకు చంద్రుడు, గురుడు, శని ఒకే లైన్​లోకి వస్తాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు కాబట్టి వాటి ప్లేస్​లు ప్రతి రాత్రి మారుతుంటాయి. ఈ తేడాలు చూడాలంటే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. జూన్​ 18న ఆ గురుడు, శని గ్రహాల మధ్య నుంచి చంద్రుడు జర్నీ చేస్తాడు. దాన్నే మూన్​ టిల్టింగ్​ అంటారు. అంటే కక్ష్య గతి తప్పడం. ఇంకా సింపుల్​గా చెప్పాలంటే లైన్​ దాటిపోవడం. ఈ టైంలో సూర్యుడి చుట్టూ తిరిగే భూకక్ష్యతో పోలిస్తే చందమామ కక్ష్య వంగినట్టు కనిపిస్తుంది.