వేసవిలో వానలు ఫుల్లు..

వేసవిలో వానలు ఫుల్లు..

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వేసవి వానలు దండిగా పడినై. సమ్మర్  సీజన్ లో కురవాల్సిన సాధారణం కన్నా భారీగా వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా రికార్డయింది. 32 జిల్లాల్లో అత్యంత అధిక (లార్జ్​ ఎక్సెస్​) వర్షపాతం రికార్డవగా.. ఒక్క నల్గొండ జిల్లాలో మాత్రం అధిక (ఎక్సెస్) వర్షపాతం నమోదయింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక రిపోర్టును విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 22 దాకా 14.61 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా అయితే సమ్మర్​ సీజన్​లో కురవాల్సిన వర్షాలు 5.48 సెంటీమీటర్లే. అయితే సగటు కన్నా 167 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్​లో అత్యధికంగా 23.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతంతో పోలిస్తే ఇది 274 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఆ తర్వాత జనగామ జిల్లాలో 22.34 సెంటీమీటర్లు (274 శాతం), మహబూబాబాద్​లో 21.89 (236 శాతం), కామారెడ్డిలో 20.49 (256 శాతం), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19.98 (159 శాతం) సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అతి తక్కువగా నల్గొండ జిల్లాలో 6.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా ఆ జిల్లా సగటుతో పోలిస్తే ఎక్కువే కావడం గమనార్హం.తెల్లవారుజామున భారీ వాన రాష్ట్రంలోని 20 జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

హైదరాబాద్​లో భారీ వర్షం పడింది. పలు చోట్ల గాలి దుమారంతో వానలు పడ్డాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా వెల్గటూరులో 5.9, కరీంనగర్​ జిల్లా గుండిలో 5.5, సంగారెడ్డి జిల్లా కడ్పాల్​లో 5.4, నిర్మల్​ జిల్లా జామ్​లో 4.2, మంచిర్యాల జిల్లా తాండూర్​లో 4.1, మెదక్​ జిల్లా రేగోడ్​లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, నాగర్​కర్నూల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి, హైదరాబాద్, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్​ తదితర జిల్లాల్లోనూ వర్షం కురిసింది. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో 3.2, రామచంద్రాపురంలో 2.7, కుత్బుల్లాపూర్​లో 2.5, మల్కాజిగిరిలో 2.3, ముషీరాబాద్, శేరిలింగంపల్లిలో 2, కూకట్​పల్లి, ఉప్పల్​లో 1.7, హయత్​నగర్​లో 1.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఉష్ణోగ్రతలు తగ్గినయ్​


వానలు పడుతుండడంతో ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయాయి. నిన్నటిదాకా 45 డిగ్రీలుగా రికార్డయిన టెంపరేచర్లు..  సడన్​గా 43 డిగ్రీలకు తగ్గిపోయాయి. అత్యధికంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలలో 43.8 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండపూర్​లో 43.7, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా జంబుగ, కెరమెరి, కరీంనగర్​ జిల్లా తంగులలో 43.4, నిర్మల్​ జిల్లా తానూర్​లో 43.3, మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో 43.2, మంచిర్యాల నీల్వాయిలో 43.1, ఆదిలాబాద్​ అర్లిటిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్​లోని శేరిలింగంపల్లిలో గరిష్ఠంగా 40 డిగ్రీలు రికార్డయింది.