యాదగిరిగుట్టలో ఫుల్ రష్.. ధర్మదర్శనానికి ఐదు గంటలు

యాదగిరిగుట్టలో ఫుల్ రష్.. ధర్మదర్శనానికి ఐదు గంటలు
  •     ధర్మదర్శనానికి ఐదు గంటలు  
  •     స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం
  •     సండే ఒక్కరోజే రూ.83.19 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలీడేస్ ముగుస్తుండడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. కొండ కింద భక్తులు పార్క్ చేసిన వాహనాలతో పార్కింగ్ ఏరియా నిండిపోయింది. దీంతో యాగశాల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ ప్లేస్​లోకి వాహనాలను డైవర్ట్ చేశారు. దీనివల్ల కొండ కింద ఘాట్ రోడ్డు వద్ద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. 

ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్ద నుంచి ఘాట్ రోడ్డు ఎంట్రీ వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్​లోకి డైవర్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. వీఐపీ టికెట్ల ద్వారా 7 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రూ.10.50 లక్షల ఇన్ కమ్ వచ్చింది. 

బ్రేక్ దర్శన టికెట్లతో1,986 మంది స్వామివారిని దర్శించుకోగా..రూ.5,95,800 ఆదాయం వచ్చింది. మొత్తంగా 40 వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 4,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. మరోవైపు ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సుప్రభాతం సేవతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఆలయంలో చేపట్టిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ఒక్కరోజే రూ.83.19 లక్షల ఆదాయం

ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం రూ.83,19,056 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా ఏకంగా రూ.33,06,520 రాగా.. కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9 లక్షల ఇన్ కమ్ వచ్చింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.11,81,200, బ్రేక్ దర్శనాలతో రూ.5,95,800, వీఐపీ టికెట్ల ద్వారా రూ.10.50 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.1,99,200, యాదరుషి నిలయం ద్వారా రూ.4,04,016, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.1,81,064, తలనీలాల ద్వారా రూ.2.05 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.