ప్రజాస్వామ్యానికి ఆటుపోట్లు

ప్రజాస్వామ్యానికి ఆటుపోట్లు

ప్రపంచంలోనే భారతదేశం ఎన్నో ప్రత్యేకతలకు, భిన్నత్వానికి నెలవైనది. సువిశాలమైన ఈ దేశంలో సిరిసంపదలకు కొదవలేదు. రత్నాల గడ్డగా మన దేశం పేరు పొందినది. దేశవ్యాప్తంగా వేరువేరు  సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, కులాలు, భాషలతోపాటు భిన్న భావాలు కలిగి ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిఉంది. అయితే, 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సైతం అమలు కాలేదు. పేదరికం ఇప్పటికీ కొనసాగడమంటే పేదలు పాలకుల నిర్లక్ష్యానికి బలికావడమే కారణం. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమరం మొదలవుతుంది. ఎన్నికల సమయంలో  భారీసంఖ్యలో పార్టీలు పుడుతూనే ఉంటాయి. ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.  ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులున్నాయి. ఓటు హక్కు ఉన్నది.  గత 30 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ, సరళీకరణ ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రజల బ్రతుకులు ఛిన్నాభిన్నమైనాయి. చేతులతో పనిచేసే వ్యవసాయంతోపాటు ఇతర రంగాలలో కూడా సాంకేతికమైన అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మనిషి స్వయంశక్తి మీద కాకుండా యంత్రాల మీద ఆధారపడే పరిస్థితి దాపురించింది.  గణనీయమైన మార్పులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఇంకా దేశంలో పేదరికం మాత్రం పోలేదు. రాజ్యాంగంలో పేర్కొన్న., డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బీఆర్​అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొక్కి చెప్పిన విధంగా కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య రంగాలు ప్రజలకు చేరువ కాలేదు. సామాజిక న్యాయం నినాదం వరకే మిగిలిపోయింది.  ఇండ్ల స్థలాలు, పక్కాఇండ్లు కావాలని ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వైద్యం, విద్య కార్పొరేటీకరణ అయిపోయింది. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమా అని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారు. మున్సిపాలిటీల పేరుతో పెద్ద గ్రామాల కూలీలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. నిరుద్యోగ సమస్య పెనుభూతంలా తయారయింది. నేతల మాటలు కోటలు దాటుతున్నా అమలులో మాత్రం అరగజం ముందుకు కదలడం లేదు. 

మోదీ హామీలు ఏమయ్యాయి?

ఎన్నికల హామీలు అమలెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది.  ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల వాగ్దానాలు.. అవినీతిపరుల నల్లడబ్బు వెలికితీసి పేదలకు పంచడం, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఈ రెండు హామీలు  పది సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదు. మళ్లీ కొత్త హామీలు, నినాదాలతో ప్రజల ముందుకురావడం తిరిగి గద్దెనెక్కడం ఎలా సమర్థనీయం అవుతుంది. 75 ఏండ్లలో కొత్త మార్పులు ఏమిటి?  భూస్వామ్య స్థానంలో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌసులు, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రత్యక్షమైనాయి. కుటీర పరిశ్రమల స్థానే కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల చేతిలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగంలో వేళ్లూనుకున్నాయి.  ఆఖరికి భూమిని రైతులు నుంచి లాక్కుని కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగ్గజాలకు అప్పగించే కుట్రను రైతు సంఘాలు ఒక సంవత్సరం పాటు ఆందోళన చేసి అడ్డుకున్నాయి. 750 మంది రైతులు బలి కావడంతో మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను ఉపసంహరించుకున్నది. ఇదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. 

డబ్బు చుట్టే రాజకీయాలు

ప్రజాప్రతినిధులుగా ఎవరు గెలుస్తున్నారు.. డబ్బు, మద్యానికి ప్రజలు ఎందుకు లొంగుతున్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత స్వప్రయోజనాలు, సంపాదనే లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నారు. అందుకనే మాకు కూడా వాటా కావాలి కదా! ఉత్త పుణ్యానికి మీకు ఓటు వేయాలా? మీరు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ మళ్లీ ఎన్నికలలో గెలవడానికి మా దగ్గరికి వస్తున్నారు కదా.. అందుకనే మాకు ఓటుకు నోటివ్వండనే దుస్థితి నెలకొనడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో దామాషా ఎన్నికలకు చట్టాలు తేవాలి. రాజకీయాల్లో ప్రజాసేవకులు కనుమరుగు అవుతున్నారు. ప్రజాభక్షకులు, బడా పారిశ్రామికవేత్తలు, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, హంతకులు, గూండాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి

రాజకీయాలలో నైతిక విలువలు పడిపోతున్నాయి.  డబ్బు జబ్బు మనిషికి పట్టుకున్నది. డబ్బు చుట్టూ ప్రజలు తిరగడం దారుణం.  సంపద ఎవరు సృష్టిస్తున్నారు అంటే.. ప్రజలే. కానీ, ప్రజలే పరాన్నజీవులుగా మారుతున్నారు. సంక్షేమ పథకాలపై ఆధారపడి ప్రజలు పరాన్నజీవులుగా మారడం ప్రజాస్వామ్య మనుగడకే పెనుప్రమాదం. నేడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది.  ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవలసిన, నిలబెట్టుకోవలసిన తక్షణ కర్తవ్యంగా ప్రతిపౌరుడు గుర్తించాలి. ఎద్దు నెమరు వేసుకుంటున్నట్లు మనుషులుగా ప్రతి ఒక్కరూ అంతర్మథనం చేసుకోవాలి.  ప్రజలు కళ్ళు తెరిస్తేనే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది.  లేకపోతే తిరిగి నియంతృత్వ వ్యవస్థ ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.  భ్రష్టుపట్టిన రాజకీయాలను మట్టి కరిపించాలి.  ప్రతి ఒక్కరూ పాలకుల ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుము బిగించాలి.

ఆత్మగౌరవ పాలన ఎక్కడ?

కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో  ప్రజల ముందు ఉంచిన నినాదాలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన అమలెక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాగునీటి రంగంలో కొన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించిన చాలాచోట్ల అసంపూర్తిగానే ఉండటం దుర్మార్గం కదా!. అలాగే ఉద్యోగాల భర్తీ.  గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 2 లలో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలతో ఖాళీల భర్తీ  యధాతథంగా మిగిలిపోయాయి. నిరుద్యోగ భృతి మాటలు వరకే పరిమితం కావడం, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్రమంగా అమలు లేకపోవడంలాంటి అంశాలు కారణంగా విద్యార్థులు, యువకులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలులోకి రాగానే పోలీసుల ముమ్మర తనిఖీలలో కోట్లాది రూపాయలు, కిలోల  బంగారం పట్టుపడుతున్నాయి. వీటిపై టీవీలు, పేపర్లలో ప్రచారమేనా లేక  వాటిపైన ఏమైనా చర్యలు ఉంటాయా అనేది దాపరికంగానే ఉంటుంది. ఎన్నికలలో ప్రచార జోరు, పథకాల హోరు, డబ్బు, మద్యం ప్రచారాస్త్రాలుగా  మారడం ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఉన్నది. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. 

- చాడ వెంకటరెడ్డి,సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు