
రూ.10 వేల కోట్లు ఇచ్చే చాన్స్ త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం
ప్రభుత్వరంగానికి చెందిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో కొత్త వరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వీటి పరిస్థితిని మెరుగుపర్చడానికి మరోసారి క్యాపిటల్‌ను అందజేస్తారని సమాచారం. కేంద్ర ఆర్థికమంత్రి ఈ మేరకు త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. మోడీ ప్రభుత్వం గత నెలలోనే నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.2,500 కోట్ల క్యాపిటల్ అందజేసింది. రెగ్యులేటరీ రూల్స్ ప్రకారం సాల్వెన్సీ మార్జిన్ పెరగాలంటే వీటికి మరో రూ.12 వేల కోట్ల వరకు అవసరం అని అంచనా. వచ్చే నెల ఒకటిన ప్రవేశపెట్టబోయే 2020–21 బడ్జెట్‌లో ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా క్యాపిటల్ అందించడం వల్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమేగాక, మూడింటినీ విలీనం చేయడం కూడా సాధ్యపడుతుంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసే ఒకే సంస్థగా చేస్తామని 2018–19 బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. వీటి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల విలీనం సాధ్యం కాలేదు. మూడు కంపెనీలను కలిపిన తరువాత ఏర్పడే కంపెనీని స్టాక్‌మార్కెట్లలో లిస్ట్ చేయించాలనే ఆలోచన కూడా ఉంది.
ఎకానమీ స్లోడౌన్ వల్ల డీలా పడ్డ ఇండస్ట్రీలు ఈ బడ్జెట్ ద్వారా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని అడుగుతున్నాయి. వాహన అమ్మకాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటో ఇండస్ట్రీ , ముడిపదార్థాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాలని అల్యూమినియం ఇండస్ట్రీ కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.10 వేల కోట్ల వరకు క్యాపిటల్ అందజేయనున్నట్టు తెలుస్తోంది.
ఆదుకోవాలంటున్న ఆటో పరిశ్రమ
ఎకానమీ స్లోడౌన్‌తో ఇబ్బందిపడుతున్న వాహన పరిశ్రమ కూడా ప్రభుత్వంవైపు చూస్తోంది. అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయి ఇబ్బందిపడుతున్న తమ ఇండస్ట్రీని గట్టెక్కించడానికి బడ్జెట్‌లో తగిన చర్యలు ప్రకటించాలని కోరింది. వాహన అమ్మకాలపై జీఎస్టీని తగ్గించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి లిథియం ఆయాన్ బ్యాటరీల సెల్స్ దిగుమతిపై సుకాలను రద్దు చేయాలని సూచించింది. పాత వాహనాలను తుక్కుగా మార్చితే ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పాత వాహనాల రీరిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని విన్నవించింది. ‘‘కాలుష్యం తగ్గించడానికి బీఎస్–6 రూల్స్ తీసుకురావడం మంచి నిర్ణయం. బీఎస్–6 ఇంజన్ల తయారీ వల్ల వాహనాల ధరలు పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం పెరిగింది. అయితే చివరికి ఆటో అమ్మకాలు పడిపోయాయి. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే అటు ప్రభుత్వానికి ఇటు మాకూ లాభం. నిజానికి జీఎస్టీ తగ్గింపుపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలి. ఇది బడ్జెట్‌తో సంబంధం లేని విషయం. అయితే వాహనాలకు డిమాండ్ మళ్లీ రావాలంటే జీఎస్టీ తగ్గింపు తప్పనిసరి’’ అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. పాత వాహనాలను వదిలేసి కొత్తవి కొనేవారికి జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సూచించాయి. రాష్ట్రాల రవాణా సంస్థలతో కొత్త బస్సులు కొనిపించేలా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని ఆటో పరిశ్రమ కోరుతోంది.
కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలంటున్న అల్యూమినియం పరిశ్రమ
అల్యూమినియం ఫ్లోరైడ్, కాస్టిక్ సోడా లై, గ్రీన్ అనోడ్ వంటి ముడిపదార్థాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేయాలని అల్యూమినియం ఇండస్ట్రీ ఆర్థికమంత్రిత్వశాఖను కోరింది. ఎక్కువ దిగుమతి సుంకాలు ఉండటం వల్ల అల్యూమినియం ప్రొడక్టుల ధరలు అధికంగా ఉంటున్నాయని, ఇంటర్నేషనల్ మార్కెట్లతో పోటీ పడలేకపోతున్నామని అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ముఖ్యమైన ముడిపదార్థాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించకుంటే నష్టపోతామని పేర్కొంది. కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని కోరింది. ఇండియాలో అల్యూమినియం ప్రొడక్టుల ధరలు ఎక్కువ కావడం వల్ల, దిగుమతులు పెరిగాయని ఏఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. అల్యూమినియం స్క్రాప్‌పై దిగుమతి సుంకాన్ని 2.5 శాతం నుంచి పది శాతానికి పెంచాలని కోరింది.