
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆదర్శనగర్, కమల్ కోట్ గ్రామాల మధ్య రూ. కోటి పది లక్షలతో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సోమవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని న్యూ లింగంపల్లి గ్రామంలో నూతనంగా రూ.50 లక్షలతో నిర్మించిన శివాలయం, హనుమాన్ ఆలయాల ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు.
ఆదర్శనగర్ గ్రామం వరకు బీటీ రోడ్ నిర్మాణం, గ్రామ శివారులో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఒక్క న్యూ లింగంపల్లి గ్రామానికి రూ.60 లక్షలు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా దేవాదాయశాఖ ద్వారా మంజూరు చేశామన్నారు. జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సర్పంచులు ముత్యం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నూనెల గంగాధర్, ఎంపీటీసీ
సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి
నిర్మల్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను వేడుకలా జరపాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో మంత్రి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్ లతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 21 రోజుల పాటు ఉత్సవాలు జరపాలని కోరారు. గ్రామాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై మంత్రి ఆరా తీశారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.