తనిఖీల పేరుతో సామాన్యులకు ఇబ్బందులు: జి.నిరంజన్‌‌‌‌

తనిఖీల పేరుతో సామాన్యులకు ఇబ్బందులు: జి.నిరంజన్‌‌‌‌
  • ఎలక్షన్స్​కు సంబంధం లేని డబ్బు, బంగారం సీజ్​ చేస్తున్నరు
  • సీఈసీకి పీసీసీ సీనియర్‌‌‌‌ వైస్​ప్రెసిడెంట్​ నిరంజన్‌‌‌‌ లెటర్​

హైదరాబాద్, వెలుగు: తనిఖీల పేరిట ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీసీసీ సీనియర్‌‌‌‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌‌‌‌ అన్నారు. వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్ రాజీవ్​ కుమార్​కు లెటర్​ రాశారు.

ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని.. అయితే రోజువారీ వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకి సృష్టిస్తూ సామాన్యుడిని కష్టాల్లోకి నెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అధికారులు వ్యాపార ప్రాంతాలు, వైన్ షాపులు, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తనిఖీలు నిర్వహించి డబ్బును సీజ్ చేస్తున్నారన్నారు.  ఆ తరువాత.. ఎక్కడో తనిఖీ చేస్తుండగా దొరికినట్లు రసీదులు ఇస్తున్నారన్నారు.

నగదు సీజ్ చేసే ముందు ఎన్నికల కోసం ఉద్దేశించినదా ? కాదా ? అని నిర్ధారించుకోవాలన్నారు.  షెడ్యూల్ ప్రకటన, పోలింగ్ తేదీ మధ్య 51 రోజులు నిడివి ఉందని.. అంటే ఒక వ్యక్తి తన డబ్బును తిరిగి పొందడానికి 50 రోజులకుపైగా వేచి చూడాల్సి వస్తోందన్నారు. ఈ నెల 9న షెడ్యూల్‌‌‌‌ విడుదల నాటి నుంచి మోడల్​ కోడ్​ కండక్ట్​ను కఠినంగా అమలు చేస్తున్నామని చూపించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందని.. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎన్నికల అధికారులు వ్యవహరించేలా ఆదేశించాలని ఆయన లెటర్​లో కోరారు.