మహబూబ్ నగర్ లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: జి. రవి నాయక్

మహబూబ్ నగర్ లో  ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: జి. రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  కలెక్టర్  జి. రవి నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.  జిల్లాలోని మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 2, 43,331 మంది, జడ్చర్లలో 2,12,384 మంది, దేవరకద్రలో 2,28,077 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

80 ఏండ్లు దాటిన వారు,40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న వారికి హోమ్  ఓటర్స్ గా గుర్తించి వారు కోరితే ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లాలో 12,931 మంది దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారు 6,821 మంది ఉన్నారని చెప్పారు. జిల్లాలోని 864 పోలింగ్  స్టేషన్లలో సౌలతులు కల్పించామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక పోలీస్  ఆఫీసర్​ను నోడల్  ఆఫీసర్​గా నియమించామని, ఎలక్షన్​ రూల్స్​ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. జడ్చర్ల రిటర్నింగ్  ఆఫీసర్​ ఎస్. మోహన్ రావు, యు. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎలక్షన్​ రూల్స్​ పాటించాల్సిందే..

వనపర్తి: జిల్లాలో ఎలక్షన్​ రూల్స్​ పక్కాగా అమలు చేస్తామని, వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని వనపర్తి కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. మీడియా సెంటర్ లో వారు మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదని చెప్పారు. జిల్లాలో భద్రత పెంచామని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు  వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అడిషనల్  కలెక్టర్  తిరుపతిరావు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

గద్వాల, వెలుగు: జిల్లాలో ఈ నెల 6న సీఎం కేసీఆర్​ పర్యటన సందర్భంగా బహిరంగసభ, పార్కింగ్  స్థలాన్ని శుక్రవారం ఎస్పీ రితిరాజ్  పరిశీలించారు. సీఎం కాన్వాయ్  రూట్  మ్యాప్ ను, సభాస్థలి, గ్యాలరీల ఏర్పాట్లను పరిశీలించి, బందోస్తుకు సంబంధించి పోలీస్  అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్  డైవర్షన్  చేయాలని, విధుల్లో ఉన్న పోలీస్​ ఆఫీసర్లు, సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. ఏఎస్పీ రవి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్  డీఎస్పీ ఇమ్మాన్యుయేల్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లు శ్రీకాంత్, షుకూర్  ఉన్నారు.