మన దోస్తి.. చాలా స్ట్రాంగ్ ప్రధాని మోదీతో బైడెన్ భేటీ

 మన దోస్తి.. చాలా స్ట్రాంగ్ ప్రధాని మోదీతో బైడెన్ భేటీ
  • వివిధ రంగాల్లో మరింత సహకారం 
  • ఇండో-పసిఫిక్​కు క్వాడ్ సపోర్ట్ కొనసాగిస్తామని ప్రకటన    
  • కీలక ఒప్పందాలపై సంతకాలు, చర్చలు   

న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందామని రెండు దేశాల అధినేతలు నిర్ణయించారు. వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకరించారు. జీ20 సమిట్ లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రాత్రి 7.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటపాటు జరిగిన భేటీలో ఇరువురు నేతలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్, డిఫెన్స్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం, తదితర అంశాలపై చర్చించారు. మీటింగ్ తర్వాత ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం బైడెన్ కు మోదీ ప్రైవేట్ విందు ఇచ్చారు. జీ20 కూటమి పట్ల ఇరుదేశాలు కమిట్మెంట్ తో ముందుకు వెళ్లాలని, సమిట్ ద్వారా వచ్చే ఫలితాలు ఉమ్మడి లక్ష్యాల సాధన దిశగా మార్గం చూపుతాయని ఇరువురు నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.   రక్షణ రంగంతో పాటు న్యూక్లియర్ ఎనర్జీ, ఏఐ, స్పేస్ సెక్టార్లలోనూ సహకారం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు పరోక్షంగా ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం, సమగ్ర భద్రతకు మద్దతును క్వాడ్(ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) కూటమి కొనసాగిస్తుందని ప్రకటించారు.

 చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాలు విజయవంతం కావడంపై ఇస్రోకు, ప్రధాని మోదీకి బైడెన్ అభినందనలు తెలిపారు. ‘‘మా మీటింగ్ బాగా జరిగింది. ప్రపంచానికి మరింత మంచి చేయడంలో మన రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ కీలక పాత్ర కొనసాగుతుంది” అంటూ మీటింగ్ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. ఇండియా, అమెరికా ఫ్రెండ్షిప్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ గా మారిందని మీటింగ్ తర్వాత బైడెన్ ట్వీట్ చేశారు. మీటింగ్ లో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) జాక్ సలివన్.. ఇండియా తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. కాగా, అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. 

కీలక ఒప్పందాలపై సంతకాలు, చర్చలు..

బైడెన్, మోదీ భేటీలో ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగగా.. పలు ఒప్పందాలపై పురోగతి దిశగా చర్చలు జరిగాయి. అమెరికా నేషనల్ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ మధ్య.. బయోటెక్నాలజీ, బయోమాన్యుఫాక్చరింగ్ రంగాల్లో సహకారానికి ఒప్పందం కుదిరింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనల్లో కలిసి పని చేసేందుకు, సెమీకండక్టర్లు, ఫ్యూచర్ జనరేషన్ టెలికమ్యూనికేషన్స్ లో సహకారానికి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. జెట్ ఇంజన్లు, ప్రిడేటర్ డ్రోన్ ల కొనుగోలుకు సంబంధించిన డీల్స్, 5జీ, 6జీ నెట్ వర్క్ లు, ఇతర క్రిటికల్ టెక్నాలజీల్లో సహకారం వంటి అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. కీలకమైన రైల్ డీల్ పై కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి.