యువతను కేసీఆర్ మోసం చేసిండు : వంశీకృష్ణ

యువతను కేసీఆర్ మోసం చేసిండు : వంశీకృష్ణ
  •  ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా న్యాయం చేసిండు: వంశీకృష్ణ

కోల్ బెల్ట్/చెన్నూరు, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసమే సబ్బండవర్గాలు తెలంగాణ కోసం ఉద్యమించాయని, వారిని నమ్మించి మోసం చేసిన ఘనత కేసీఆర్‌‌‌‌కే దక్కుతుందని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కుమారుడు, యువ నేత గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తొమ్మిదేండ్లు యువతకు కేసీఆర్ అన్యాయం చేశాడని ఫైర్​అయ్యారు. 

సోమవారం మందమర్రి మండలం చిర్రకుంట, మందమర్రి పట్టణంలోని మంజూనాథ గార్డెన్, భీమారం మండలం ఫౌనూర్, జైపూర్ మండలం నర్వా, చెన్నూరు మండలంలోని లింగంపల్లి, కాంబోజిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ బూత్ లెవల్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి గొంతు కోసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. 

‘‘ఉద్యమాన్ని జనాల వరకు చేరనీయకుండా నాడు ఆంధ్ర పాలకులు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఉద్యమంలో నుంచి పుట్టింది వీ6. జనం వాయిస్ వినిపించిన వీ6ని కేసీఆర్ బ్యాన్ చేసిండు” అని విమర్శించారు. కొత్తగా వీ6 యూత్ చానల్‌‌ను లాంచ్ చేస్తున్నామని, యూత్ వాయిస్‌‌ను తాను వినిపిస్తానని చెప్పారు. బాల్క సుమన్‌‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

వివేక్‌‌ని గెలిపిస్తే చెన్నూరు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. -బాల్క సుమన్‌‌ను చెన్నూరు నుంచి తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కొడుకు నల్లాల క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. 15 రోజులు కష్టపడి కాంగ్రెస్ గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. 

 ALSO READ : జీడిమెట్ల లో కెమికల్ డ్రమ్ములు లీకై ఉక్కిరిబిక్కిరి

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్‌‌ వంగ లక్ష్మి-, ఉప సర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు సమ్మక్క, సత్యం, సురేశ్, రామయ్యతో పాటు సుమారుగా 200 మంది మహిళలు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. కార్యక్రమంలో నేతలు మూలరాజు రెడ్డి చల్ల రాంరెడ్డి, రఘునాథ్ రెడ్డి, శ్రీకాంత్, గద్దె రామచందర్, ఆకుల అంజి, ఓడన్నల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.