పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : గడ్డం వంశీకృష్ణ
  • తాను ఎంపీగా గెలిచాక మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతా
  • ఉపాధి, ఉద్యోగాలకు ప్రయారిటీ ఇస్తా
  • గత సర్కార్‌‌‌‌ హయాంలో పెద్దపల్లి అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపణ 

యాదగిరిగుట్ట, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిని వంశీకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్‌‌ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చెప్పారు. ముఖ్యంగా యువత నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోందన్నారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని, అభివృద్ధి అనేది దరిదాపుల్లో కూడా కనిపించడం లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతుంటే.. పెద్దపల్లి నియోజకవర్గం మాత్రం వెనుకబడిందన్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన యువత ఉద్యోగాలు రాక ఆటోలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, తాగు నీరు సహా కనీస మౌలిక సదుపాయాలను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించలేదని మండిపడ్డారు. ఓపెన్ ఏరియాల్లో పబ్లిక్‌‌ టాయిలెట్స్ లేకపోవడంతో పర్సనల్‌‌ అవసరాల కోసం పెద్దపల్లికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే పెద్దపల్లి పార్లమెంట్‌‌ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, క్యాడర్ తనకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం కోసం తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్‌‌ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వారు చూపిన మార్గంలో ముందుకెళ్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం స్థానిక కాంగ్రెస్  నాయకులు వంశీకృష్ణను సన్మానించారు.