ప్రజా పోరాట యోధుడు గద్దర్

ప్రజా పోరాట యోధుడు గద్దర్

గతించి కాలం గడుస్తూ పోతున్నా గద్దర్(విఠల్​రావు)​ను మరువలేకపోతున్నాం. కవిగా, మేధావిగా, రాజకీయవేత్తగా, తెలుగు రాష్ట్రాల్లో,  దేశంలో పేరు తెలియని వారు ఉండరు. కాళ్లకు గజ్జ కట్టి ఆడి, పాడి.. ఫ్యూడల్ వ్యవస్థకి, దొరలు చేస్తున్న అరాచకాలకు గ్రామాలకు గ్రామాలు రోదిస్తున్నప్పుడు తన పాట ద్వారా బాధిత ప్రజల్ని ఓదార్చాడు. మా భూమి సినిమా లో ‘బండేనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె పోతవ్ కొడకో నైజము సర్కరోడా’ అని తన గళంతో తెలంగాణ ప్రజల్ని ఒక్కసారిగా కదిలించిన వ్యక్తి గద్దర్ పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎంచుకున్న సిద్ధాంతం కోసం తన జీవితాన్ని త్యాగం చేసాడు. 

జన నాట్య మండలి ద్వారా ప్రజలకి చేరువయ్యాడు. అతని ఉద్యమ స్ఫూర్తిని దగ్గరగా చూస్తే అణచివేత, అసమానతలు ఎక్కడ ఉంటే అక్కడ అతని గళం వినపపడుతుండేది. మతతత్వ శక్తుల అరాచకాలు రాజ్యమేలుతున్నప్పుడు మైనారిటీలు, క్రైస్తవులు, దళిత, ఆదివాసీ జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు వారి జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. వారికీ అండగా పిడికిలి బిగించి ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన గద్దర్  చరిత్ర మరవలేనిది.     

 తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన తర్వాత మరోసారి దగా పడిందని  పోరాటం తప్ప గత్యంతరం లేదని బలంగా నమ్మిన గద్దర్, 1969 తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత క్రియాశీలంగా ఆంధ్రా పెత్తందారి దోపిడీలపై ఉద్యమించారు. కారంచేడు, చుండూరు సంఘటనలతో గద్దర్, శివసాగర్, కత్తి పద్మారావు, బాలగోపాల్, బొజ్జా తారకం లాంటి వ్యక్తులతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాడు.1990 దశకంలో ఆస్తిత్వ ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. మండల్​ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో కులాల వెనుకబాటు, వాటి వివక్షల మీద ఊరూరా ఉద్యమిస్తూ పాడాడు. 

వెన్నులో బుల్లెట్​తోనే..

మంద కృష్ణ మాదిగ  పోరాడుతున్న ‘మాదిగ దండోరా’ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా మాలమహానాడు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. ఇది మాల, మాదిగల మధ్య  విభజనను పెంచింది. ఈ వ్యతిరేకతను తగ్గించటానికి ఇరు వర్గాల మధ్య సోదరభావం కోసం నిరంతరం తపించడమే కాకుండా వీరి మధ్య సయోధ్య కోసం పెద్దన్న పాత్ర పోషించాడు. 1995 ఒరేయ్ రిక్షా సినిమాలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ’ పాటకు గాను నంది అవార్డు ప్రకటిస్తే గద్దర్ తాను నమ్ముకున్న విలువల కోసం తిరస్కరించటం జరిగింది. 1997 చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిపిన కాల్పుల్లో ప్రాణాలతో బయటపడినా బుల్లెట్లను వెన్నుపూసలో ఉంచుకొని పోరాటాన్ని సాగించాడు. 

శాంతి చర్చల్లో కీలక పాత్ర

గద్దర్ ఎంచుకున్న కమ్యూనిస్ట్ ఉద్యమ నేపథ్యాన్ని సున్నితంగా పరిశీలిస్తే వామపక్ష ఉద్యమాన్ని అతివాద ధోరణిలోనే కాకుండా తన సొంత శిబిరాన్ని సంస్కరించాలనే ఆలోచనను చాలా సార్లు చర్చల్లో పెట్టినప్పటికి దానికి ఆమోదం లభించక పోవటంతో సొంత వర్గంలోనే కొందరితో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే 2004 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక శాంతి చర్చల పేరిట మావోయిస్టులతో చర్చలు జరిపితే అవి సఫలం కాకపోవడంతో మావోయిస్టులను తిరిగి అడవిలోకి పంపే వరకు గద్దర్ చాలా చొరవ తీసుకున్నరు.  లాల్, నీల్ పేరిట ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని కోరుకునే అంబేద్కర్ వాదులను, వామపక్షవాదులను ఒకతాటిపైకి తీసుకువచ్చి ఆధిపత్య రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి నిలువలేదు.

ఉద్యమానికి ఆయన పాటలే చుక్కాని

2009 కేసీఆర్ దీక్ష ఒక భాగమైతే, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగాస్వాములయ్యారు. ఇప్పుడు రాకపోతే తెలంగాణ మరెప్పుడు రాదనే భ్రమను ఆనాడు ప్రజల్లో కేసీఆర్ బలంగా నమ్మించడంలో విజయం సాధించాడు. ఈ ఉద్యమానికి తాత్విక పునాది వేసిన గద్దర్.. ఉద్యమానికి  రెండు పాటలు ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకలా గానమా’ ఈ పాట ఎన్నో హృదయాలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ అతి తక్కువ కాలంలో ప్రజల్లోకి వెళ్ళింది. అన్ని వర్గాల ప్రజల మనసును తాకింది. 

ఏనాడూ గౌరవించని కేసీఆర్​

సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణ స్వప్నం ఆసన్నమయ్యే క్రమంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా గద్దర్ లాంటి ఉద్యమకారులను, కళాకారులను శాసించబోయే తెలంగాణలో ఎలాంటి చిక్కుముడులు ఉండొద్దనుకున్నాడు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నావల్లే సాధ్యమైందనే ఏకస్వామ్య అధిపత్య పోకడను కలిగి ఉన్నాడు.  కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఇటీవల మరణించిన కళాకారుడు సాయిచందు లాంటి వాళ్లకు కనీస గౌరవం దక్కలేదన్న విమర్శ బలంగా వినబడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనాకర్షణ కలిగిన గద్దర్ ని విస్మరిస్తే పార్టీకి నష్టం అని భావించిన కేసీఆర్ ఆయన అంత్యక్రియలను అధికారలాంఛనాలతో జరపాలని ఆదేశించారు. ఇందులో రాజకీయం తప్ప గౌరవం లేదు. 

పార్లమెంటరీ పంథా ఎంచుకొని..

తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పాలన దిశగా అడుగులు వేయటంలేదు. కుట్రపూరిత ఎజెండాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన జరుగుతున్నది. గద్దర్ ఇంతటి అరాచక, అసంతృప్తి పాలనను సహించలేక పార్లమెంటరీ పంథాను ఎంచుకోవాలనుకున్నాడు.  వివిధ రాజకీయ శిబిరాల్లో భాగస్వామి అయ్యాడు. అతని ఆఖరి రోజుల్లో గద్దర్ ప్రజా పార్టీ పెట్టాడు. 

దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు చేరువవ్వాలనుకున్నాడు. ఈ దేశంలో కులం పోవాలంటే సాంస్కృతిక విప్లవం రావాలన్నాడు.  గద్దర్ జీవితమంతా సంఘర్షణ, అలజడి. అతని తపనంతా వ్యవస్థని సంస్కరించాలనేదే. ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగం దాని ఆవశ్యకతను నొక్కి చెప్పేవాడు. వచ్చిన తెలంగాణ వల్ల ప్రయోజనం లేకుండాపోయిందని కన్నుమూసే వరకు అయన తీవ్ర ఆవేదనతో ఉద్యమించారు. గద్దర్ చివరి మాటలు ‘నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుష్యులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. దాన్ని నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.

- సునీల్ నీరడి, రీసెర్చ్​ స్కాలర్​, ఓయూ