పాలకులను ప్రశ్నించిన గద్దర్ పాట

పాలకులను ప్రశ్నించిన గద్దర్ పాట

ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ 70వ దశకం నుంచి 90వ దశకం వరకు ఎగసిపడిన విప్లవోద్యమం మొదలు.. 2000 సంవత్సరం తర్వాత వెల్లువెత్తిన తెలంగాణ ఉద్యమం వరకు జరిగిన అన్నీ సభలను తన ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఆయన విప్లవోద్యమ పాటకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి ఆదివాసీల పోరాటం నుంచి దండకారణ్యం మీదుగా దేశవ్యాప్తంగా విస్తరించిన విప్లవోద్యమంలో అన్నీ చోట్ల ఆయన ఆడిపాడారు. 

సినీ డైరెక్టర్ బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో  ‘ఆపర రిక్షా’ పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్ధిరపడింది. గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. దొర ఏందిరో.. దొర పీకుడేందిరో’ పాట గద్దర్ నోట పాపులర్ అయింది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోకి ఈ పాట అనువాదమైంది. ఆయన ఎక్కడ సభ జరిగినా.. ‘భారత దేశం భాగ్య సీమరా.. పాడి పంటలకు లోటు లేదురా.. అంగట్లోనా అన్నీ ఉన్నయ్ అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. దరిద్రమెందుకురో నాయినా’ అంటూ గద్దర్ ప్రశ్నించారు.