ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతోన్న గాడ్జెట్ల మోజు

ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతోన్న గాడ్జెట్ల మోజు

ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే గొప్ప. కానీ ఇప్పుడు చేతికో మొబైల్, చెవికో ఇయర్ ఫోన్. స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లు మన చేతికొచ్చి పదేండ్లు దాటుతోంది. వీటితో జీవితం స్మార్ట్‌‌‌‌గా మారడమేమో గానీ ప్రపంచానికి పెద్ద ముప్పుగా మాత్రం మారుతున్నాయి. సమస్యలను చక్కబెట్టడం కోసం కనిపెట్టిన డిజిటల్ వస్తువులు ఇప్పుడు కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు టీవీ కొంటే పాతికేండ్లు అట్లనే ఉండేది. కానీ, ఇప్పుడు ఏడాదికో ఫోన్ మార్చాలి. లేటెస్ట్‌‌‌‌గా ఏదైనా కొత్త మోడల్ రాగానే దానికి అప్‌‌‌‌గ్రేడ్ అవ్వాలి. ఇలా గాడ్జెట్ల మోజులో పడి రోజుకో రకాన్ని మారుస్తున్న వాళ్లు పెరిగారు. దాంతో వాడి పడేసిన పాత గాడ్జెట్లన్నీ కుప్పలుగా పోగవుతున్నాయి. 

మామూలు చెత్త సంగతి ఏమో గానీ ఈ ఎలక్ట్రానిక్ చెత్త మాత్రం మహా డేంజర్ అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ–వేస్ట్ అంత డేంజరా? మరయితే దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి? అందులో మన బాధ్యత ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా ఈ–వేస్ట్ పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టకపోతే ప్రపంచమే ఒక ఈ-డస్ట్ బిన్‌‌‌‌గా మారే ప్రమాదం ఉందని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఈ–వేస్ట్‌‌‌‌ను ఎక్కువగా పోగవుతున్న దేశాల్లో చైనా, అమెరికా, ఇండియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మనదేశంలో ఏటా సుమారు నలభై లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోందని అంచనా. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ–వేస్ట్ అనేది 21 వ శతాబ్దంలోనే అతి పెద్ద ప్రాబ్లమ్‌‌‌‌గా మారుతోంది. 

ఈ–వేస్ట్ అంటే..

ఈ–వేస్ట్ అంటే ‘ఎలక్ట్రానిక్ వేస్ట్’ అని అర్థం. అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులతో పోగయ్యే చెత్త. ప్రస్తుతం రోజువారీ జీవితమంతా టెక్నాలజీ చుట్టూనే తిరుగుతోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచీ అవసరాలకి, వినోదానికి.. ఇలా ప్రతిపనీ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే ముడిపడి ఉంటుంది. అయితే టెక్నాలజీ అనేది రోజురోజుకీ డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవడం కోసం పాతవాటిని అమ్మేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. మొబైళ్ల నుంచి మొదలుపెడితే టీవీ, కంప్యూటర్, లాప్‌‌‌‌టాప్‌‌‌‌, వాషింగ్‌‌‌‌మెషిన్, ఫ్రిజ్‌‌‌‌, ఏసీ, హీటర్, మైక్రోవేవ్​ ఒవెన్, లైట్లు, బ్యాటరీలు,ఛార్జర్లు, ప్రింటర్, స్కానర్.. ఇలా కరెంటు, బ్యాటరీలతో పనిచేసే వస్తువులన్నీ వాటి జీవితకాలం ముగిసిందనో లేక పనిచేయడం లేదనో పారేస్తుంటారు. అవన్నీ ఈ–వేస్ట్ కిందకే వస్తాయి. 

ఫోన్లు ఎక్కువ

ఈ ఏడాది సుమారు 530 కోట్ల మొబైల్ ఫోన్లు పనికి రాకుండా పోతాయి. వాటిని పారేయాల్సి ఉంటుందని ‘వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌‌‌‌మెంట్(డబ్ల్యూఈఈఈ)’ ఫోరమ్ చెప్పింది. అలాగే మనదేశంలో యాభై కోట్ల మంది స్మార్ట్‌‌‌‌ఫోన్లు వాడుతున్నారని కిందటేడాది లెక్కలు చెప్తున్నాయి. కొవిడ్ తర్వాత ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చదువుల కారణంగా అవి ఇంకా ఎక్కువ పెరిగాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ అవసరమే. వాటిని వాడక తప్పదు. కానీ, వాడేసిన పాత ఫోన్లను ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు సమస్య. కిందటేడాది మన దేశంలోకి 15 కోట్ల ఫోన్లు దిగుమతి అయ్యాయంటే.. దాదాపు వాటికి సమానంగా పాత ఫోన్లు చెత్త బుట్టలోకి చేరాయని అర్థం. ఒక్క అమెరికాలోనే రోజుకు నాలుగు లక్షల సెల్‌‌‌‌ఫోన్లు చెత్తబుట్టలో పారేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లే ఇన్ని ఉంటే ఇక పరిశ్రమలు, ఆఫీసులు, ఇళ్లల్లో వాడి పారేసే ఎలక్ట్రిక్‌‌‌‌, ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాలన్నీ కలిపితే ఎంత చెత్త పోగవుతుందో అర్థం చేసుకోవచ్చు. 

లక్షల టన్నులు

‘ఎలక్ట్రానిక్ వేస్ట్​ సునామీ ప్రపంచాన్ని ముంచేస్తోంది’ అని ఇటీవల ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రస్తుతం భూమి మీద 347 మిలియన్(34.7కోట్ల) టన్నుల ఈ–వేస్ట్ ఉంది. ఈ–వేస్ట్‌‌‌‌ను ఎక్కువగా పోగుచేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, ఇండియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనాలో అతి ఎక్కువగా 10.1 మిలియన్ టన్నులు పోగవుతుంటే.. అమెరికాలో 6.9 మిలియన్‌‌‌‌ టన్నులు, ఇండియాలో 4.2 మిలియన్‌‌‌‌ టన్నులు ఈ–వేస్ట్ పోగవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల టన్నులు, యూరప్‌‌‌‌లో 1.2 కోట్ల టన్నుల ఈ–వేస్ట్​ పోగవుతోంది. ప్రపంచమంతా కలిసి కిందటేడాది దాదాపు అయిదున్నర కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్‌‌‌‌ వేస్ట్​ను పారేసిందని ‘గ్లోబల్‌‌‌‌ ఈ–వేస్ట్‌‌‌‌ మానిటర్‌‌‌‌’ ప్రకటించింది. అంటే ప్రపంచంలో ప్రతి మనిషి సగటున దాదాపు ఏడు కిలోల ఈ–వేస్ట్ పోగు చేస్తున్నట్లు లెక్క. మరో నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ–వేస్ట్ ఏటా 33 శాతం మేరకు పెరుగుతుందని, ఈ చెత్తకుప్ప సైజు ఎనిమిది ఈజిప్ట్ పిరమిడ్ల కంటే ఎక్కువని ఐక్యరాజ్య సమితి ‘స్టెప్‌‌‌‌ ఇనీషియేటివ్‌‌‌‌’ (సాల్వింగ్‌‌‌‌ ఈ–వేస్ట్‌‌‌‌ ప్రాబ్లెమ్‌‌‌‌ ఇనీషియేటివ్‌‌‌‌) హెచ్చరిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ–వేస్ట్ సమస్య ప్రపంచానికి ఎంత పెద్ద ముప్పుగా మారిందో తెలుస్తోంది.

లక్షల కోట్లు వృథా

అంతకు ముందుతో పోలిస్తే ఐదేండ్లలో ఈ–వేస్ట్​ 21 శాతం పెరిగింది. మరో పదేండ్లలో ఇంతకు రెట్టింపు అవుతుందని అంచనా. ఇండ్లల్లో తయారయ్యే చెత్తనే రీసైకిల్‌‌‌‌ చేసి మరోలా ఉపయోగిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాల్ని అలా చేయలేమా? అంటే చేయొచ్చు. చేస్తున్నాం కూడా. కాకపోతే అది చాలా చాలా తక్కువ. కేవలం 17 శాతం ఈ–వేస్ట్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రీసైకిల్ అవుతోంది. 83 శాతానికి పైగా ఈ–వేస్ట్‌‌‌‌ని వృథాగా పారేస్తున్నారు. దానివల్ల సుమారు నాలుగు లక్షల కోట్ల విలువ చేసే బంగారం, ప్లాటినం, రాగి, వెండి లాంటి లోహాల్ని చెత్తకుప్పలో పారేసినట్లవుతోంది. నాలుగు లక్షల కోట్లంటే- కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. ఈ చెత్తలో సగానికన్నా ఎక్కువ ఆసియా దేశాల్లోనే తయారవుతోంది. గతేడాది పారేసిన ఎలక్ట్రానిక్ చెత్తనంతా పెద్ద పెద్ద ఓడల్లో నింపితే ఆ ఓడల వరుస 125 కిలోమీటర్ల పొడవు ఉంటుందట! చూస్తూ చూస్తూ ఇంత విలువైన వస్తువుల్ని చెత్తగా పడేస్తున్నామంటే టెక్నాలజీని మనం సరిగ్గా వాడుకోవట్లేదనే కదా అర్థం.

దొంగతనంగా తరలించి..

మనదేశంలో ఈ–వేస్ట్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర(20 వేల టన్నులు), తమిళనాడు(14 వేల టన్నులు), ఆంధ్రప్రదేశ్(12 వేల టన్నులు), ఉత్తర ప్రదేశ్(12 వేల టన్నులు) ముందువరుసలో ఉన్నాయి. ఈ–చెత్త పోగుచేస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు ముందున్నాయి. అలా మొత్తంగా మనదేశంలో ఏటా దాదాపు నలభై లక్షల టన్నుల ఈ–వేస్ట్‌‌‌‌ తయారవుతోంది. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల చెత్త కూడా ఇక్కడికే వస్తోంది. మామూలుగా ఎవరూ ఒకరి ఇంట్లో చెత్త మరొకరి ఇంట్లో వేయరు. కానీ, ఈ–వేస్ట్ విషయానికొస్తే కొన్ని దేశాలు అదే పని చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దగ్గర పోగయిన ఈ–వేస్ట్‌‌‌‌ను అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు అక్రమంగా పంపిస్తున్నాయి. ఒక్క యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ నుంచే 13లక్షల టన్నుల వాడి పడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటి డాక్యుమెంట్​లు, పర్మిషన్​లు లేకుండా విదేశాలకు తరలి వెళ్తున్నాయనేది ఒక అంచనా. 

నష్టాలు బోలెడు

ఎలక్ట్రానిక్‌‌‌‌ వేస్ట్ వల్ల డబ్బు వృథా అవ్వడమే కాదు, భూమికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చెప్పలేనంత నష్టం జరుగుతోంది. ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువుల్లో ప్లాటినం, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, క్రోమియం, కోబాల్ట్, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, లిథియం, బేరియం, నికెల్, థాలియం వంటి ప్రమాదకరమైన లోహాలు కూడా ఉంటాయి. ఒక మామూలు మొబైల్‌‌‌‌ లేదా లాప్‌‌‌‌టాప్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌బోర్డులోనే పదహారు వేర్వేరు లోహాలు ఉంటాయి. అలా రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్‌‌‌‌, నికెల్‌‌‌‌, జింక్‌‌‌‌, సెలెనియం... లాంటి అరవై రకాల హానికర కెమికల్స్​ ఉంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే కొన్ని లోహాలు భూమిలో కరగవు, పూర్తిగా కాలిపోవు. అందుకే ఇవి పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. ఈ–వేస్ట్‌‌‌‌లోఉండే సీసం, పాదరసం లాంటివి మనిషి మెదడు మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి. అవి చెత్తకుప్పలో పడిఉన్నప్పుడు చుట్టూ ఉన్న నేలని, భూగర్భ జలాల్ని కలుషితం చేస్తాయి. వాటిని కాల్చినప్పుడు ఆ రసాయనాలు గాలిలో కలిసి గాలి కూడా కలుషితం అవుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే పదార్థాలు గాలిలోకి, భూమిలోకి క్యాన్సర్‌‌‌‌ కారకాలను వదులుతాయి. ఇవి మనిషి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
ట్యూబ్‌‌‌‌లైట్, సీఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ బల్బులు, ఎక్స్‌‌‌‌పైరీ అయిన బ్యాటరీలు వంటివాటిని నేలపై పడేస్తే.. వాటిలోని పాదరసం, సీసం వంటి ప్రమాదకర లోహాలు మట్టిలోకి చేరి, ఆ ప్రదేశంలోని మట్టి ఎందుకూ పనికిరాకుండా నాశనమవుతుంది. అక్కడ భూమి ఎప్పటికీ పనికిరాకుండా పోతుంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్ చెత్త వ్యవసాయ భూముల్లోకి చేరితే.. భవిష్యత్తులో ప్రజల తిండికి కూడా కరువు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యం కూడా..

ఈ–వేస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడి పరిసరాల్లో ఉండేవాళ్లకు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. ఈ–వేస్ట్ కారణంగా గాలి, నీరు, నేల.. అన్నీ కలుషితమవుతాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను తగలబెట్టినప్పుడు గాలిలోకి హానికరమైన విష వాయువులు వెలువడతాయి. వీటిని పీల్చడం ద్వారా ఆ వాయువులు రక్తంలోకి చేరి అవయవాలను పాడుచేస్తాయి. ఈ–వేస్ట్ నుంచి విడుదలయ్యే హానికరమైన వాయువులకు ఎక్స్‌‌‌‌పోజ్ అయినవారిలో ఎదుగుదల లోపాలు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్‌‌‌‌, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇన్‌‌‌‌ఫెర్టిలిటీ, కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవాల పనితీరు, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయి. అంతేకాకుండా డీఎన్‌‌‌‌ఏ మార్పులు కూడా వస్తాయి. ఇలా అనేక అనారోగ్య సమస్యలతో పాటు ఊపిరితిత్తుల జబ్బులు, చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు ఆఫ్రికా పిల్లల్లో అకాల మరణాలకు కారణమవుతున్నాయి. 

బలవుతున్న ఆఫ్రికా పిల్లలు

ఆఫ్రికాలో తయారయ్యే ఈ–వేస్ట్ చాలా తక్కువ. కానీ ఈ–వేస్ట్ వల్ల ఎక్కువగా నష్టపోతుంది మాత్రం ఆఫ్రికా ప్రజలే. ఆఫ్రికా దేశాల్లోని పిల్లలు ఈ–వేస్ట్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. యూరోపియన్‌‌‌‌ దేశాల నుంచి ఏటా దాదాపు 1.3 మిలియన్‌‌‌‌ టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ వెనకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఓడల్లో తరలిపోతుంది. అలా ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న ఈ–వేస్ట్‌‌‌‌కు ఆఫ్రికా దేశాలు డంపింగ్‌‌‌‌ యార్డులుగా మారాయి. ఆఫ్రికా దేశాల్లో ఇరవై శాతనికి పైగా జనం ఈ–వేస్ట్ కారణంగానే చనిపోతున్నారు. ఈ–వేస్ట్ కుప్పలుగా పోగయిన చోట పిల్లలు గుమికూడి వాటిలో పనికొచ్చే వాటి కోసం వెతుకుతుంటారు. స్క్రూడ్రైవర్, సుత్తి లాంటివి పట్టుకుని వాటిని పగలగొట్టడం, బాగు చేయడం లాంటివి చేస్తుంటారు. అలా తెలియకుండా ఎలక్ట్రానిక్ చెత్త కుప్పల్లోనే వాళ్లు ఎక్కువ టైం గడుపుతుంటారు. దీనివల్ల ఆఫ్రికా పిల్లలు రకరకాల వ్యాధులకు లోనవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.

యూరప్‌‌‌‌ నుంచి ఎలక్ట్రానిక్‌‌‌‌ చెత్తని తీసుకొచ్చి ఘనాలోని అగ్బోగ్‌‌‌‌బ్లోషి అనే ప్రాంతంలో ఎక్కువగా పడేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాల్లోని విడిభాగాల నుంచి రాగిని ఇతర లోహాల్ని వేరుచేయడమే అక్కడున్న ఎనభైవేల జనాభాకు బతుకుదెరువు. దానికోసం వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాల్ని తగలబెడుతుంటారు. అలా తయారైన బూడిద అంతా అక్కడి భూమిలో కలిసిపోతోంది. అలా అక్కడి భూమి, జీవరాశులు నష్టపోతున్నాయి. అగ్బోగ్‌‌‌‌బ్లోషి మురికివాడలో పెరిగే కోళ్లు పెట్టిన గుడ్లను సైంటిస్టులు పరిశీలించారు. ఆ గుడ్లలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ‘డయాక్సిన్స్’ ఉన్నట్టు తెలిసింది.ఆ గుడ్డు ఒక్కటి తింటే- ‘క్లోరినేటెడ్‌‌‌‌ డయాక్సిన్స్‌‌‌‌’ అనే కెమికల్స్​ మనిషి శరీరంలో ఉండాల్సినదానికంటే220 రెట్లు ఎక్కువయ్యాయట. ఇవే కాకుండా మరెన్నో ఇతర హానికరమైన కెమికల్స్​ కూడా ఆ గుడ్లలో ఉన్నాయని రీసెర్చర్లు చెప్తున్నారు. ఇవి మనిషిని చంపగలిగే ప్రమాదకరమైన రసాయనాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ–వేస్ట్ ఎంత ప్రమాదకరమైనదో. మనదేశంలో ఢిల్లీ దగ్గర సీలంపూర్‌‌‌‌లో కూడా ఇలాంటి ఈ–వేస్ట్ డంపింగ్ యార్డ్‌‌‌‌ ఒకటుంది. అక్కడ ఉంటున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా ఉంటోందని, చిన్న వయసులోనే కిడ్నీలు, లివర్లు, గుండె ఫెయిల్ అవుతున్నాయని పలు రిపోర్ట్‌‌‌‌లు చెప్తున్నాయి.

రీసైక్లింగ్ ఇలా..

ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 శాతం ఈ–వేస్ట్ మాత్రమే రీసైకిల్ అవుతోంది. వచ్చే ఏడాది నాటికి దీన్ని 30 శాతానికి పెంచాలని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ–వేస్ట్ వల్ల కలిగే అనర్థాలను కొన్నిదేశాలు మాత్రమే అర్థం చేసుకుని, చర్యలు తీసుకుంటున్నాయి. ‘చాలా దేశాలు ఏటా పోగయ్యే ఈ–వేస్ట్‌‌‌‌పై కచ్చితమైన లెక్కలు సేకరించే పరిస్థితిలో కూడా లేవు’ అని యూరోపియన్‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ ఏజెన్సీ చెప్తోంది. ఇండియా, చైనా, కొన్ని ఆఫ్రికా దేశాలు ఈ–వేస్ట్‌‌‌‌ను రీసైకిల్ చేస్తున్నాయి. అయితే యంత్రాలు చేయాల్సిన పనిని మనుషులతో చేయిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని లోహాలను సేకరించడానికి పార్టులను చేత్తోనే విడదీయడం, కుప్పగా పడేసి తగలబెట్టడం, యాసిడ్‌‌‌‌ పోసి కరగబెట్టడం... లాంటివి చేస్తున్నారు. పేద దేశాల్లోని ప్రజలకు ఇదో ఉపాధి అయింది. విదేశాల నుంచి తెచ్చి పడేసిన ఈ–వ్యర్థాలు మనదేశంలో చాలా టన్నులే ఉన్నాయి. మనదేశంలో ఉన్న అతిపెద్ద ఈ–వేస్ట్ డంప్ యార్డ్ ఢిల్లీ దగ్గర సీలంపూర్‌‌‌‌లో ఉంది. అక్కడ రోడ్ల మీదా, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాలు పడి ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లారీల్లో ఎలక్ట్రానిక్ చెత్త ఇక్కడికి చేరుతుంది. ముంబయి ఓడరేవు నుంచి కూడా చెత్త లారీలు వస్తుంటాయి. ఒక్కో లారీ పది టన్నుల ఈ–వ్యర్థాలను మోసుకొస్తుంది. సీలంపూర్ వాసులు వాటి నుంచి పనికొచ్చే భాగాలను తీసుకుని మళ్లీ కొత్త పరికరాన్ని అసెంబుల్‌‌‌‌ చేసి, తిరిగి అమ్ముతారు. లోహాలను సేకరిస్తారు. పనికొచ్చే మెటల్స్​ను తీసుకున్నాక మిగిలిన చెత్తని లారీల్లోకి ఎక్కించి అడవుల్లోకి తీసుకెళ్లి తగలబెడతారు. నిజానికి మామూలు చెత్తతో పోలిస్తే ఎలక్ట్రానిక్‌‌‌‌ చెత్త పరిమాణం తక్కువే అయినా దాని వల్ల కలిగే ప్రమాదం మాత్రం డెబ్భై శాతం ఎక్కువ.

ఈ–వేస్ట్ పాలసీలు

ఈ–వేస్ట్ అనేది ప్రపంచ సమస్యగా మారినందువల్ల ప్రపంచంలో చాలా చోట్ల దీనిపై చాలా చర్చలు జరిగాయి. చాలాదేశాలు ఈ–వేస్ట్‌‌‌‌ను కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక పాలసీలు రూపొందించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 78 దేశాలు ఈ–వేస్ట్ పై చట్టాలు, కంట్రోల్​ చేసే పద్ధతులు తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం కూడా ఈ–వేస్ట్​ను తగ్గించడానికి పదేండ్ల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2016లో ‘ఈ–వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రూల్స్‌‌‌‌’ని విడుదల చేసింది. వాటి ప్రకారం ఎలక్ట్రానిక్ పరికరాలు తయారుచేసే సంస్థలు తమ మార్కెట్‌‌‌‌కి తగ్గట్టుగా ఈ–వేస్ట్‌‌‌‌ని రీసైక్లింగ్‌‌‌‌ కూడా చేయించాలి. తమ అమ్మకాల్లో కనీసం 20 శాతానికి సమానంగా వస్తువుల్ని తిరిగి తీసుకోవాలి. దాన్ని ఏటా పది శాతం పెంచుకుంటూ పోవాలి. దీన్ని సరిగ్గా అమలు చేస్తే ఈ–-వేస్ట్‌‌‌‌ ఎవరికీ, ఏ విధమైన హానీ చేయకుండా సరైన పద్ధతిలో రీసైక్లింగ్‌‌‌‌కి వెళ్తుంది. 2017 అక్టోబర్‌‌‌‌ 1 నుంచి ‘ఈ–వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రూల్స్‌‌‌‌’ అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ–చెత్త రీసైక్లింగ్‌‌‌‌ చేయాలి. 
అయితే ఈ–వేస్ట్ రూల్స్​ అమలులోకి వచ్చినా.. దేశంలో రీసైక్లింగ్‌‌‌‌ అనుకున్నంతగా జరగట్లేదు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులు అఫీషియల్ రీసైకిల్ కేంద్రాల కంటే డంప్ యార్డ్‌‌‌‌లకే ఎక్కువగా వెళ్తున్నాయి. పేరుకుపోతున్న ఈ–చెత్తతో పోల్చి చూసుకుంటే, రీసైక్లింగ్‌‌‌‌ కేంద్రాలకు చేరుతున్నది చాలా తక్కువ. మిగిలినదంతా ఖాళీ స్థలాల్లోకి, నదులు, సముద్రాల్లోకి చేరుతూ పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టం కలిగిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్‌‌‌‌ను సరిగ్గా అమలు చేస్తున్న కంపెనీల్లో అమెజాన్, కెనాన్, స్ప్రింట్, డెల్, ఇంటెల్ లాంటి సంస్థలు ముందున్నాయి. ఇవి పాడైపోయిన తమ ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి ప్లాంట్‌‌‌‌కు తెప్పించి రీసైక్లింగ్ పనులు చేపడుతున్నాయి. నోకియా, శాంసంగ్, ఎల్‌‌‌‌జీ, ఒప్పో, వివో, లావా, ఇన్ఫినిక్స్, వన్‌‌‌‌ప్లస్, నథింగ్ లాంటి సంస్థలు కూడా ఈ– వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ పాలసీలు అమలు చేస్తున్నాయి. 

పోరాడుతున్న భారత కంపెనీలు

ఈ–వేస్ట్‌‌‌‌ తగ్గించడం కోసం పలురకాల ఈ–వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. పోగవుతున్న ఈ–చెత్తను రీసైకిల్ చేయడం, ఈ–చెత్త నుంచి పనికొచ్చే మెటల్స్​ వేరు చేయడం అలాగే పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను సంస్థలకు చేరవేయడం, జనాల్లో ఈ–వేస్ట్‌‌‌‌ గురించి అవగాహన కల్పించడంపై ఈ కంపెనీలు పనిచేస్తుంటాయి. మనదేశంలో ఎకోసెంట్రిక్ మేనేజ్‌‌‌‌మెంట్, ఎన్‌‌‌‌సైడ్ ఇండియా, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్, అటెరో రీసైక్లింగ్, బిన్‌‌‌‌బ్యాగ్ లాంటి కంపెనీలు ఈ–వేస్ట్‌‌‌‌ను తగ్గించడం కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ ‘సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌‌‌‌’కింద రిజిస్టర్ అయ్యి పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ–వేస్ట్‌‌‌‌ను రీసైకిల్ చేస్తుంటే.. మరికొన్ని సంస్థలు ఈ–వేస్ట్‌‌‌‌పై జనాల్లో అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

హైదరాబాద్‌‌‌‌లో ఇలా..

హైదరాబాద్‌‌‌‌లో ఏటా 40వేల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతుందని రిపోర్ట్‌‌‌‌లు చెప్తున్నాయి. మరో ఐదేండ్లలో ఇది లక్ష టన్నుల వరకూ పెరగొచ్చని అంచనా. సిటీలో ఈ–వేస్ట్ తగ్గించడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.. కూకట్​పల్లి, ఖైరతాబాద్, హఫీజ్‌‌‌‌పేట్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్‌‌‌‌లో ఈ–వేస్ట్ కలెక్షన్ సెంటర్స్‌‌‌‌ను ఏర్పాటుచేస్తోంది. 

ఫస్ట్ రిఫైనరీ ప్లాంట్

దేశంలోనే మొదటి ఈ–వేస్ట్ రిఫైనరీ ప్లాంట్‌‌‌‌ను తెలంగాణ మేడ్చల్ జిల్లాలోని దుండిగల్‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్నారు. యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన రెల్డాన్ రిఫైనింగ్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇది. వంద కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్‌‌‌‌లో ఈ–వేస్ట్ ద్వారా సేకరించిన సర్క్యూట్ బోర్డ్స్, సీపీయూ, ర్యామ్, ప్రాసెసర్ వంటివాటి నుంచి గోల్డ్, సిల్వర్, పెలాడియంను వేరుచేస్తారు. మిగిలిన వేస్ట్‌‌‌‌ను రీసైక్లింగ్‌‌‌‌కు పంపిస్తారు. ఈ ఏడాది నవంబర్ నాటికి ప్లాంట్ పూర్తవుతుంది. ఈ ప్లాంట్ కెపాసిటీ 20 వేల టన్నులు. 

ఈ–వేస్ట్‌‌‌‌లో చేరుతున్నవి ఇవే...

ఈ-వేస్ట్​లో రిఫ్రిజిరేటర్, ఎయిర్‌‌‌‌ కండీషనర్, మైక్రోవేవ్, వాక్యూమ్‌‌‌‌ క్లీనర్, టోస్టర్, హెయిర్‌‌‌‌ డ్రయ్యర్, వాషింగ్‌‌‌‌ మెషీన్, స్టవ్, డిష్‌‌‌‌వాషర్, ఎలక్ట్రిక్ కుక్కర్ , హీట్‌‌‌‌పంప్ , స్క్రీన్స్, మానిటర్, టెలివిజన్, డిజిటల్ నోట్‌‌‌‌బుక్, టాబ్లెట్, ఐటీ, టెలీఎక్విప్‌‌‌‌మెంట్, సెల్‌‌‌‌ఫోన్స్, వైర్‌‌‌‌లెస్‌‌‌‌ రూటర్, కాలిక్యులేటర్ , బల్బులు, ఎల్‌‌‌‌ఈడీ ల్లాంటి వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో పోగవుతున్న ఈ–వేస్ట్‌‌‌‌లో కంప్యూటర్, మొబైల్ ఎక్విప్‌‌‌‌మెంట్ 70 శాతం, మెడికల్ ఎక్విప్‌‌‌‌మెంట్ 7 శాతం, ఎలక్ట్రికల్ వస్తువులు 8 శాతం, ఇంటి పరికరాలు 3 శాతం, టెలీ కమ్యూనికేషన్ ఎక్విప్‌‌‌‌మెంట్ 12 శాతం ఉన్నాయి. 
ఈ–వేస్ట్‌‌‌‌లో చేరుతున్న వస్తువులను యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ పది రకాలుగా డివైడ్ చేసింది.

పెద్దగా ఉండే ఇంటి వస్తువులు 

(ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌‌‌‌ మెషిన్లు వంటివి)
చిన్న గృహోపకరణాలు(ఎలక్ట్రిక్‌‌‌‌ స్టవ్‌‌‌‌, ఇండక్షన్‌‌‌‌ స్టవ్‌‌‌‌, డిజిటల్‌‌‌‌ వాచీలు వంటివి)
కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (డిజిటల్‌‌‌‌ కెమెరాలు, పోర్టబుల్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌ వంటివి)
ఐటీ–టెలికం ఎక్విప్‌‌‌‌మెంట్ (లాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, డెస్క్‌‌‌‌టాప్‌‌‌‌లు, మొబైల్‌‌‌‌ ఫోన్లు వంటివి)
లైటింగ్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్ (ట్యూబ్‌‌‌‌లైట్లు, ఎల్‌‌‌‌ఈడీ లైట్లు, లైట్ హోల్డర్లు వంటివి)
ఎలక్ట్రికల్‌‌‌‌/ఎలక్ట్రానిక్‌‌‌‌ పనిముట్లు
ఎలక్ట్రానిక్‌‌‌‌ ఆటబొమ్మలు 
మెడికల్ ఎక్విప్ మెంట్ (బీపీ, షుగర్‌‌‌‌ మెషిన్ల వంటివి)
ఆటోమేటిక్‌‌‌‌ డిస్పెన్సర్స్‌‌‌‌ (వెండింగ్‌‌‌‌, వెయింగ్‌‌‌‌ మెషిన్లు)
మానిటరింగ్‌‌‌‌ పరికరాలు (సీసీ కెమెరాల వంటివి)

మనమేం చేయాలి

ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తలో ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువుల వాటా వేగంగా పెరుగుతుందని స్టడీలు చెప్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఈ–వేస్ట్‌‌‌‌ను తగ్గించేందుకు పూనుకోవాలి అంటున్నారు నిపుణులు. 

ఎలక్ట్రానిక్‌‌‌‌ వేస్ట్ వల్ల జరుగుతున్న హానిని తగ్గించడం కోసం ముందుగా వస్తువులు పనిచేసినంత కాలం పూర్తిగా వాడడం అలవాటు చేసుకోవాలి. వస్తువు పనిచేస్తుండగానే మరొకటి కొన్నప్పుడు పాతదాన్ని అవసరం ఉన్న వాళ్లకి ఇచ్చేయాలి. చెత్తలో పారేయకూడదు. ప్రస్తుతం మనదేశంలో చాలాచోట్ల ఆథరైజ్డ్ రీసైక్లింగ్ సెంటర్లు ఉన్నాయి. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను పారేయకుండా నేరుగా తీసుకెళ్లి రీసైక్లింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఇవ్వాలి. 

మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీలకు పాత వస్తువులను సేకరించే పాలసీలు ఉన్నాయి. అందుకే ధరతో సంబంధం లేకుండా పాత ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి సంస్థలకు ఇచ్చేయడం అందరి బాధ్యత. అలాగే వాటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్‌‌‌‌ చేయడం కంపెనీల బాధ్యత.

వస్తువు కొనేటప్పుడే దాని ఉపయోగం ఎంత? అది పనిచేయనప్పుడు ఎలా డిస్పోజ్‌‌‌‌ చేయాలో తెలుసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయనప్పుడు వెంటనే కొత్తది కొనకుండా దాన్నే రిపేర్ చేసి వాడుకోడానికి ట్రై చేయాలి. కొన్ని వస్తువులను సరిగ్గా పనిచేస్తున్నా.. కొత్త మోడల్‌‌‌‌ వచ్చింది కాబట్టి పాతది పక్కనపడేస్తారు చాలామంది. ఫోన్లు, టీవీలు ఎక్కువగా ఇలా పనిచేసే దశలోనే చెత్తలోకి చేరుతున్నాయట. అందుకే ఈ అలవాటుని మానుకోవాలి. కొత్తరకం వచ్చిందని కాకుండా అవసరముంటేనే కొనాలి అనేది నిపుణుల సలహా.

వన్ ఛార్జర్ పాలసీ

ఈ–వేస్ట్‌‌‌‌ను తగ్గించేందుకు తాజాగా వన్ ఛార్జర్ అనే పాలసీని తీసుకొచ్చారు. రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు రకరకాల ఛార్జర్లు వాడకుండా అన్ని ఫోన్స్, గాడ్జెట్లకు ఒకటే ఛార్జర్‌‌‌‌‌‌‌‌ను వాడితే చాలావరకు ఈ–వేస్ట్‌‌‌‌ను తగ్గించొచ్చు. అందుకే 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాలన్నింటికీ యూఎస్‌‌‌‌బీ టైప్– సీ తరహా పోర్ట్‌‌‌‌ మాత్రమే తీసుకురావాలని యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఇటీవలే ప్రకటించింది. ఈ–వేస్ట్‌‌‌‌ను తగ్గించడం కోసం అమెరికా, యూరోప్ ప్రభుత్వాలు ఇప్పటికే స్మార్ట్​ ఫోన్లు, ట్యాబ్​‌‌‌‌లకు బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే ఛార్జింగ్ పోర్టు ఉండాలని తయారీ సంస్థలను ఆదేశించాయి. మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ రూల్ త్వరలోనే అమలు కానుంది. యాపిల్ కంపెనీ కూడా టైప్–సీ పోర్ట్‌‌‌‌కు మారక తప్పట్లేదు.

 

అవేర్‌‌‌‌‌‌నెస్ పెరుగుతోంది

ఒకప్పుడు వేస్ట్ అంటే పేపర్లు, ప్లాస్టిక్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటికి సమానంగా ఈ–వేస్ట్ కూడా పోగవుతోంది. ఈ–వేస్ట్‌‌ను పోగు చేసి రీసైక్లింగ్‌‌కు ఇచ్చేంత తీరిక జనానికి ఉండకపోవచ్చు. అందుకే మేము ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసే మోడల్‌‌ను ఎంచుకున్నాం. ఈ–వేస్ట్‌‌ను పారవేయకుండా రీసైక్లింగ్‌‌కు ఇద్దామనుకున్న వాళ్లు మాకు కాల్ చేస్తారు. మేము వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్‌‌కు పంపిస్తాం. విలువైన పాత ఎలక్ట్రానిక్ వస్తువులకు వాటి బరువుని బట్టి కొంత మొత్తం చెల్లిస్తుంటాం. మా దగ్గరకు వచ్చే ఈ–వేస్ట్‌‌లో టీవీలు, ఫ్రిజ్‌‌లు, ఏసీలు, వాషింగ్‌‌ మెషిన్లు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి వస్తువులను చెత్తలో పడేసేవాళ్లు. జనాల్లో ఇప్పుడిప్పుడే అవేర్‌‌‌‌నెస్ పెరుగుతోంది. ఇ-వేస్ట్‌‌ను సెపరేట్‌‌గా రీసైక్లింగ్‌‌కు పంపడం పెరిగింది.

ఎన్విరాన్‌‌మెంట్‌‌కు మేలు చేసేలా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మాకు వేస్ట్ మేనేజ్‌‌మెంట్ ఆలోచన వచ్చింది. సిటీ నుంచి ప్రతి నెలా 150 టన్నుల వేస్ట్‌‌ను కలెక్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఈ–వేస్ట్ గురించి అవేర్‌‌‌‌నెస్ తీసుకొస్తున్నాం. త్వరలోనే ఈ–వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టబోతున్నాం. దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా తీసుకున్నాం. ఇండియాను జీరో వేస్ట్ కంట్రీగా మార్చాలన్నది మా లక్ష్యం.  అయితే ప్రస్తుతానికి మా ఫోకస్ అంతా హైదరాబాద్ మీదే ఉంది. 

జుబేర్, 
కో-ఫౌండర్, క్రాప్‌‌బిన్

::: తిలక్​