జల సంరక్షణతోనే భవిష్యత్ తరాల మనుగడ..ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిన గద్వాల కలెక్టర్

జల సంరక్షణతోనే భవిష్యత్ తరాల మనుగడ..ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిన గద్వాల కలెక్టర్

గద్వాల, వెలుగు :  ఇంకుడుగుంతలు, ఫామ్ పాండ్​ల నిర్మాణంతో జలాలను సంరక్షించి, నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్​ తరాలకు మనుగడ ఉంటుందని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న తొమ్మిదవ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ లో ఆయన పాల్గొని, గద్వాల జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ నీటి నిర్వహణ పద్ధతులపై గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. 

గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణం, పొలాలలో పంట కుంటలు, కమ్యూనిటీ సోప్ పిట్స్, ఊట కుంటల నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. మైక్రో ఇరిగేషన్ విధానాల ద్వారా తక్కువ నీటితో ఆరుతడి పంటల సాగు, సామాజిక అడవుల పెంపకం, చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. జల సంరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాకుండా, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.