గద్వాల, వెలుగు: అపెండిసైటిస్‌తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నీట్ స్టూడెంట్ ఇందు(16) శనివారం రాత్రి గద్వాల సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం మృతురాలి బంధువులు, ఎర్రవల్లి గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు. గద్వాల, ఎర్రవల్లి రహదారిపై రెండున్నర గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు.
యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవల్లికి చెందిన ఇందుకు కడుపు నొప్పి రావడంతో శుక్రవారం రాత్రి గద్వాల సర్కార్ దవాఖానకు తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితి విషమంగా మారిందని, ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్లు హడావుడి చేశారు. 7 గంటల సమయంలో ఆమె డెడ్ బాడీని అంబులెన్స్ లో ఎక్కించి పేరెంట్స్ ను అందులో కూర్చోబెట్టి ఇంటికి పంపించేశారని తెలిపారు.
గ్రామస్తులు డెడ్ బాడీని హాస్పిటల్‌కు తీసుకొచ్చి రాత్రంతా హాస్పిటల్ లో ఉన్నారు. ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామని ఆర్డీవో శ్రీనివాసరావు హామీ ఇచ్చినప్పటికీ, ఆందోళనవిరమించకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలాఉంటే స్టూడెంట్ మృతిపై స్వతంత్ర విచారణ కమిటీని నియమిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందని పేర్కొన్నారు.
