
- మూడు రోజుల కింద ఓపెన్ చేసిన హైకోర్టు జడ్జి
- అన్యాయం చేశారని బార్అసోసియేషన్ మండిపాటు
- రాజీనామాలు ప్రకటించి రిలే దీక్షకు దిగిన సభ్యులు
- సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష పార్టీలు
గజ్వేల్, వెలుగు: రాష్ట్ర సర్కారు మాట తప్పింది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కు మంజూరు చేస్తామన్న సబ్ కోర్టు (సీనియర్ సివిల్ జడ్జి కోర్టు)ను సిద్దిపేటలో ఏర్పాటు చేసింది. ఆదివారం హైకోర్టు జడ్జి చేత ప్రారంభోత్సవం కూడా చేయించడంతో గజ్వేల్ బార్ అసోషియేషన్ మెంబర్స్, లాయర్లు ఆందోళనకు దిగారు. అసోసియేషన్ కు మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించి.. అదే రోజు నుంచి రిలే దీక్షలు చేపట్టారు. తాము సబ్ కోర్టు కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నామని, గజ్వేల్ లో ఏర్పాటు చేస్తామని మాటిచ్చి తప్పడం సరికాదని మండిపడ్డారు.
సిద్దిపేటలో ఇప్పటికే సబ్ కోర్టు ఉన్నా..
జిల్లాల విభజన జరగకముందు నుంచే సిద్దిపేటలో సీనియర్ సివిల్ కోర్టు ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వం జిల్లాకో సబ్ కోర్టును ఏర్పాటు చేసింది. అయితే గజ్వేల్ కు కూడా అర్హతలు ఉన్నాయని, సబ్ కోర్టు మంజూ చేయాలని స్థానిక న్యాయవాదులు, నాయకులు రెండేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 6 నెలల కింద బార్ అసోసియేషన్ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. స్పందించిన మంత్రి హరీశ్ రావు బార్అసోసియేషన్ నాయకులను హైదరాబాద్ కు పిలుచుకొని సబ్‌కోర్టు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. తర్వాత ఆయన సూచన మేరకు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, లా సెక్రటరీలను కలువగా.. వారు కూడా మాటిచ్చారు. దీంతో దీక్షలు విరమించి ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. ఉన్నట్టుండి సిద్దిపేటలో సబ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్నారని ఆదివారం ఓపెనింగ్ ఉందని ఒకరోజు ముందు తెలియడంతో షాక్ అయ్యారు. వెంటనే అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసి.. స్థానిక కోర్టు భవనం ముందు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. వీరికి న్యాయవాదులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ , బీఎస్పీ, కమ్యునిస్టు, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
గజ్వేల్‌కు ఎందుకు..?
గజ్వేల్ లో ప్రస్తుతం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులు ఉన్నాయి. ఇక్కడి కోర్టుల్లో భూముల కేసులకు సంబంధించి రూ. 25 లక్షల వరకు వ్యాల్యూ ఉన్నవి మాత్రమే తీసుకుంటారు. 25 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, మర్కూక్ తదితర మండలాలు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాయి. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ భూములు వ్యాల్యూస్ కూడా బాగా పెరిగాయి. దీంతో ల్యాండ్ కేసులతో పాటు భార్యా భర్తల తగాదాలు, కొన్ని రకాల క్రిమినల్ కేసుల కోసం కూడా సబ్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఐపీ(దివాలా), ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులకు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తోంది. గజ్వేల్ లో ఏర్పాటు చేస్తే క్లయింట్లతో పాటు అడ్వకేట్లను ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
గజ్వేల్ కు తీరని అన్యాయం
గజ్వేల్ కు సబ్‌కోర్టు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా సిద్దిపేటలో ప్రారంభించటం అన్యాయం. సిద్దిపేటలో ఇప్పటికే సబ్ కోర్టు ఉన్నా మరోటి ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదు. పెరుగుతున్న కేసులు దృష్ట్యా గజ్వేల్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. సాధించే వరకు నిరసన కొనసాగిస్తం.
–పార్థసారధి రాజు, ప్రెసిడెంట్, గజ్వేల్ బార్ అసోసియేషన్