
Starlink: అనేక సంవత్సరాలుగా భారతదేశంలో తన స్టార్ లింక్ సేవలను స్టార్ట్ చేయాలని అమెరికాకు చెందిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన ఈవీ కార్లు టెస్లా వ్యాపారాన్ని కూడా ఇండియాకు విస్తరించాలని ప్రయత్నించినా అందుకు భారత్ నుంచి క్లియరెన్సులు రాలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు, అతనికి అత్యంత సన్నిహితుడిగా మస్క్ ఉండటంతో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
టెలికాం డిపార్ట్మెంట్ స్టార్ లింక్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడైంది. అయితే దీనికి 29 కఠినమైన సెక్యూరిటీ ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. అలాగే డేటాను దేశంలోనే ప్రాసెస్ చేయాలని కూడా సూచించినట్లు తేలింది. ప్రస్తుతం భారత్ పాకిస్థానులోని ఉగ్రవాదుల స్థలాలపై దాడులు చేపట్టిన సమయంలో స్టార్ లింక్ ఎంట్రీకి అనుమతులు రావటం గమనార్హం. మిలిటరీ చర్యలకు స్టార్ లింక్ రాకకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : రూ.22వేలకే 50 అంగుళాల స్మార్ట్ టీవీ, డోన్ట్ మిస్ ది ఆఫర్..
దేశంలో ఉపగ్రహాల ద్వారా వ్యక్తులకు మెుబైల్ సేవలను అందిస్తున్న తొలి సంస్థగా స్టార్ లింక్ మారనుంది. ఇది అత్యవసర సమయాల్లో మెుబైల్ కనెక్టివిటీని నిర్థారించటంతో పాటు రిమోట్ లొకేషన్లలో కూడా నిరంతరాయంగా సేవలను పొందటానికి వీలు కల్పించనుంది. అయితే ఇప్పుడు అందరి చూపు మస్క్ భారత మార్కెట్లలో స్టార్ లింక్ సేవలకు ఎంత ఛార్జ్ చేస్తారనేదానిపైనే ఉంది.
టెలికాం రంగంలోని నిపుణుల అంచనాల ప్రకారం నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు రూ.3వేల నుంచి రూ.7వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే స్టార్ లింక్ కిట్ రూ.20వేల నుంచి రూ.35వేల వరకు ఉండొచ్చని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో నెలవారీ వైఫై సేవలకు అనేక కంపెనీలు తమ ప్లాన్లను రూ.500 నుంచి సగటున అందిస్తున్న క్రమంలో ఇంత ఖరీదైన స్టార్ లింక్ సేవలను స్వీకరిస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇప్పటికే దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, భారతీ ఎయిర్ టెల్ ఎలాన్ మస్క్ కంపెనీతో జతకట్టాయి. ఖరీదైన స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను తొలినాళ్లలో వ్యాపార సంస్థలు, కమర్షియల్ వినియోగదారులు ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే స్టార్ లింక్ సేవలు మెరుగ్గా ఉంటే త్వరలోనే భారత మార్కెట్లో పాపులర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సేవలు స్టార్ట్ కావటానికి మునుపు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.