ట్రిపుల్​ఆర్ అలైన్ మెంట్ మార్చండి

ట్రిపుల్​ఆర్ అలైన్ మెంట్ మార్చండి

హైదరాబాద్, వెలుగు: రీజనల్​ రింగ్ ​రోడ్ (ఆర్ఆర్ఆర్)​అలైన్ మెంట్ మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని కోరారు. ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూములు కోల్పోయామని.. తమకు మిగిలిన కొద్దిపాటి భూములు మళ్లీ ఆర్ఆర్ఆర్ లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూసేకరణ నోటీసులు అందుకున్న పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, సామలపల్లి, నెంటూర్, బంగ్లవెంకటాపూర్, బేగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే  తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యను వివరించారు. తమ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి.. ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని కోరారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి.. ట్రిపుల్​ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా.. రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్ర భవిష్యత్తును మార్చే ట్రిపుల్​ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 

గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. మంత్రి హామీ పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా తమ సమస్యలు చెప్పకుందామంటే ఏ మంత్రి కలిసేవారు కాదని అన్నారు. అపాయింట్ మెంట్ లేకుండా వచ్చినా.. మంత్రి వెంకట్​రెడ్డి పండుగ వేడుకలను పక్కన పెట్టి తమ సమస్యను ఎంతో ఒపిగ్గా విని.. తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషం కలిగించిందని వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.