వినాయకా.. సెలవిక

వినాయకా.. సెలవిక

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: గణపతి నిమజ్జనోత్సవం ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నిర్మల్​లోని పేట్ నంబర్ వన్ గణేశ్ మండలి వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ గణనాథునికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం మండలి సభ్యులతో కలిసి మంత్రి, కలెక్టర్ డాన్సులు చేస్తూ అలరించారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మంచిర్యాలలో వాడవాడలా శోభాయాత్రలు కన్నులపండువగా సాగాయి.

 మహిళలు కోలాటం ఆడుతూ, యువత డాన్సులు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, డీసీపీ సుధీర్​రాంనాథ్​ కేకన్​ ముఖరాం​ చౌక్​లో ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అంజనీపుత్ర ఎస్టేట్స్​ ఆధ్వర్యంలో వంద ఫీట్ల రోడ్​లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఆదిలాబాద్​పట్టణంలోని శిశుమందిర్ లో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే జోగురామన్న, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. 

కాగజ్ నగర్ పట్టణంలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హిందూ వాహిని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీశ్ బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

 రూ.1.02 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూని వేలం వేశారు. ఈ 21 కేజీల లడ్డూని దక్కిచుకునేందుకు ఔత్సాహికులు పోటీపడగా వేలంపాట హోరాహోరీగా సాగింది. రూ. 5 వేల నుంచి వేలంపాట ప్రారంభం కాగా.. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ అసిఫ్ రూ.లక్షా 2వేలకు లడ్డూని దక్కిచుకున్నాడు. మండప సభ్యులు యువకుడిని  శాలువాతో సన్మానించారు.