- గాంధీ ఆస్పత్రిలో వైద్యం, బోధన ఎలా?
పద్మారావునగర్, వెలుగు: వైద్యారోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, దవాఖానలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రొఫెసర్ క్యాడర్ పోస్టులు పెద్ద సంఖ్యలో భర్తీ కాగా.. కీలకమైన అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ మాత్రం తగ్గింది.
బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి 36 మంది ప్రొఫెసర్లు గాంధీలో చేరగా, ఇక్కడి నుంచి 9 మంది మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో గాంధీలో 67 ప్రొఫెసర్ పోస్టులకు గాను, రికార్డు స్థాయిలో 64 పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం మూడు ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే, పై స్థాయిలో ఉన్న ఈ జోష్ కింది స్థాయి పోస్టుల్లో కనిపించడం లేదు.
అసోసియేట్ల కొరతే ఎక్కువ..
దవాఖానలో కీలకమైన అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 74 ఉండగా, 28 మంది మాత్రమే ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నారు. 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 9 మంది బదిలీపై వెళ్లగా, అంతే సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 214 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 75 మంది మాత్రమే ఉన్నారు.
గాంధీ దవాఖాన నుంచి 19 మంది బదిలీపై వెళ్లగా, ఇతర దవాఖానల నుంచి ఐదుగురు మాత్రమే వచ్చారు. దీంతో ఏకంగా 139 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు ఉండగా, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరతతో సాధారణ వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
అసోసియేట్ ప్రొఫెసర్ల కొరతతో వైద్య విద్యార్థుల బోధన కుంటుపడే ప్రమాదం ఉంది. బదిలీల ప్రక్రియ ముగిసిపోవడంతో ఈ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేదు. దీంతో కొత్తగా రిక్రూట్ చేసుకునే అసిస్టెంట్ ప్రొఫెసర్లను గాంధీకి పెద్ద సంఖ్యలో కేటాయిస్తేనే ఈ సమస్య కొంత వరకు తీరుతుందని అంటున్నారు.
వచ్చింది ఇద్దరే..
గాంధీ దవాఖానను ఎప్పటి నుంచో వేధిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ల కొరత ఈ బదిలీల తర్వాత మరింత జటిలంగా మారింది. ట్రాన్స్ఫర్లలో భాగంగా నర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో వస్తారని ఆశించగా, పూర్తిగా రివర్స్ అయింది. దవాఖాన నుంచి ఏకంగా 79 మంది నర్సింగ్ ఆఫీసర్లు వెళ్లిపోగా, ఇద్దరు మాత్రమే వచ్చారు. వీటికి తోడు అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ), ఆఫీస్ సూపరింటెండెంట్(ఏవో)లు కూడా బదిలీపై వెళ్లగా, వారి స్థానాల్లో కొత్తవారు ఎవరూ రాలేదు.
