
పెద్దపల్లి జిల్లా చందపల్లి పంచాయతీ పరిధిలో ఉంది గాంధీనగర్. ఇక్కడ దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎక్కువమంది మిర్చి సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఇలా వచ్చిన డబ్బుతో కొందరు తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు. మిర్చిలో రంగు కోసం, తక్కువ కారం ఉండేవి అంటూ చాలా రకాలున్నాయి. కానీ, ఇక్కడి రైతులు మొదటి నుంచి ఘాటైన మిర్చి మాత్రమే పండిస్తున్నారు. గాంధీనగర్ రైతులు గతంలో మహారాష్ట్రలోని నాగపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు ఎండు మిర్చిని తీసుకెళ్లి అమ్మేవాళ్లు. అక్కడ ధర బాగానే గిట్టుబాటు అయినా.. రవాణా ఖర్చు ఎక్కువయ్యేది. అయితే.. ఆ నోటా ఈ నోటా ఈ మిర్చి ఘాటు గురించి జిల్లా అంతా తెలిసింది. దాంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వ్యాపారులు గాంధీనగర్‌కు వచ్చి మిర్చి కొనుక్కెళ్తున్నారు.
కూలీగా మిర్చి…
గాంధీనగర్‌లో దాదాపు రెండు వందల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మిరపకాయలు తెంపేందుకు చుట్టుపక్కల గ్రామాలైన కనగర్తి, భొంపెల్లి, పాల్తం గ్రామాల నుంచి కూలీలు వస్తుంటారు. వీరికి రోజువారీ కూలీ 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. కానీ, కూలీలు మాత్రం తమకు డబ్బు తీసుకోకుండా బదులు మిర్చి తీసుకెళ్తుంటారు. ఈ మిర్చిని బయట విడిగా అమ్మితే కిలోకు దాదాపు డెబ్భై నుంచి వంద రూపాయల వరకు ధర పలుకుతుంది.
సాగూ ప్రత్యేకమే..
మొక్కలు నాటిన తర్వాత పది నెలలకు పంట చేతికొస్తుంది. అప్పటిదాకా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటారు రైతులు. తరచూ నీటి తడులు పెడతారు. అందుకే మొక్కలు ఏపుగా పెరిగి కాయలు బాగా కాస్తాయి. మిరపకాయలను తెంపిన తర్వాత ట్రాక్టర్లలో ఇళ్లకు తీసుకొచ్చి రాశిగా పోసి ఆరబెడతారు. ఆ తర్వాత బస్తాల్లో నింపి అమ్ముతారు. అయితే.. రాశిగా పోసిన మిర్చి ఆరడానికి కొంత సమయం పడుతుంది. పూర్తిగా ఆరే దాకా పంటను వర్షం, ఎండ నుంచి కాపాడేందుకు కుప్పలపై పరదాలు, చెరువుల్లో దొరికే తుంగ కప్పుతారు. ఇలా చేస్తే మిర్చి నల్లబడకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ కుప్పలపై కప్పేందుకు గుంటూరు నుంచి ప్రత్యేకమైన పరదాలు తీసుకొస్తారు. ఇక్కడి రైతులు కేవలం మిర్చిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలుగా మొక్కజొన్న, వరి సాగు చేస్తున్నారు.
గోదాములు లేక ఇబ్బందులు…
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నిల్వ చేసుకోడానికి సరైన గోదాములు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మిర్చి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కోల్డ్ స్టోరేజీలు అవసరం. కానీ, ఇక్కడ అలాంటి గోదాములు లేకపోవడంతో ధర లేకపోయినా పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఎకరానికి లక్ష ఆదాయం…
నేను నాలుగున్నర ఎకరాల్లో మిర్చి పంట వేశాను. పంట వేసినప్పటి నుంచి మంచిగా కాపాడుకుంటే ఎకరానికి దాదాపు లక్ష వరకు సంపాదించవచ్చు. పెట్టుబడి పోనూ దాదాపు 50 వేల వరకు వెనుకేసుకోవచ్చు. ఇక్కడ కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తాం.