ఖేత్​వాడీలో వినాయకుడు స్త్రీ రూపంలో...

ఖేత్​వాడీలో వినాయకుడు స్త్రీ రూపంలో...

విఘ్నాధిపతి అయిన గణేశుడిని రకరకాల రూపాల్లో పూజిస్తారని తెలుసు. అర్ధనారీశ్వరుడిగా శివుడు పూజలందుకోవడం చూశాం. కానీ, ఇక్కడ వినాయకుడు కూడా  స్త్రీ రూపంలో కొలువుదీరుతాడు. ఈ వినాయకచవితికి ముంబైలోని ఖేత్​వాడీలో వినాయకుడు స్త్రీ రూపంలో పూజలందుకుంటాడు. 35 అడుగుల ఎత్తున్న ఈ  విగ్రహం మహారాష్ట్రలో పాపులర్​ అయిన ‘నౌవారీ చీర’ కట్టులో కనిపిస్తుంది. అంతేకాదు రెండు చేతులకు ఆకుపచ్చని గాజులు, మెడలో  గజర్​ సంప్రదాయ నగలు, చేతిలో త్రిశూలంతో శక్తి స్వరూపిణిగా ఉన్న ఈ విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. మండపం అలంకరణతో పాటు వినాయకుడి బొమ్మ కూడా స్పెషల్​గా ఉండాలని ఈసారి ‘స్త్రీ రూపంలో’ ఉన్న విగ్రహం తెచ్చారు ఖేత్​వాడీ గణేశ్​ మండప నిర్వాహకులు. వీళ్లు గణేశుడి విగ్రహం పెట్టడం ఇది 59వ సారి. ఈ ఏడాది ‘ఉమెన్ ఎంపవర్​మెంట్​’ థీమ్​ తీసుకున్నారు. వినాయకుడిని ‘వినాయక దేవి’గా పూజించాలని అనుకున్నారు.  థీమ్​కి తగ్గట్టుగా గొప్ప విజయాలు సాధించి, మహిళల శక్తిని చాటిన కొందరి ఫొటోలు పెట్టారు. వాటిలో రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి, ఇందిరా గాంధీ, కల్పనా చావ్లాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు పురాణాలు, దేవతల గురించి వివరించేందుకు  లైట్​ షో కూడా ఏర్పాటు చేశారు. 

ఆధారాలు ఇవిగో...

‘‘ఈ విగ్రహాన్ని  ‘విఘ్నేశ్వరి, స్త్రీ గణేశ్​, గణేశని’ వంటి పేర్లతో పిలుస్తున్నారు అక్కడివాళ్లు.  రాజస్తాన్​లో దొరికిన ఒకటో శతాబ్దం నాటి టెర్రాకోట వస్తువుల మీద ‘వినాయకి’ అనే పదం కనిపించింది. మధ్యప్రదేశ్​లో భేడాఘాట్​లోని ‘చౌసట్​ యోగిని టెంపుల్​’లో వినాయకి విగ్రహం ఉంది” అంటున్నాడు ​ రాజేష్​ పూజారి అనే ఆర్కియాలజిస్ట్, ఆర్ట్​ కన్జర్వేటర్.