IPO News: ఐపీవో ఫ్లాప్ షో.. నష్టాల లిస్టింగ్‌తో షాకైన ఇన్వెస్టర్లు.. మీరూ బెట్ వేశారా..?

IPO News: ఐపీవో ఫ్లాప్ షో.. నష్టాల లిస్టింగ్‌తో షాకైన ఇన్వెస్టర్లు.. మీరూ బెట్ వేశారా..?

Ganesh Consumer IPO: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ఐపీవోల రద్దీ కొనసాగుతోంది. కొత్తగా లిస్టింగ్ అవుతున్న వాటి సంఖ్యతో పాటు ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం తెరుచుకుంటున్న ఐపీవోల లిస్ట్ కూడా భారీగానే ఉంది. చాలా కాలం తర్వాత మార్కెట్లలో ఈ రద్దీ తిరిగి రాగా.. ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎగబడుతున్నారు. ఐపీవోలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపారం, గత పనితీరు, లాభాల తీరు భవిష్యత్తు వ్యూహాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవటం ముఖ్యం. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గణేష్ కన్జూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ ఐపీవో గురించే. ఆశిష్ కచోలియా మద్ధతు కలిగిన ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు సోమవారం డిస్కౌంటెడ్ లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 8.39 నష్టంతో రూ.295 వద్ద అలాగే బీఎస్ఈలో రూ.296.05 వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి కంపెనీ తన గరిష్ఠ ఇష్యూ ధరను షేరుకు రూ.322గా ప్రకటించినప్పటికీ నేడు లిస్టింగ్ దానికంటే తక్కువగా జరగటంతో బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు నిరాశకుగురయ్యారు. 

అయితే గ్రేమార్కెట్లలో ముందుగా ఊహించినట్లుగానే షేర్లు డిస్కౌంటెడ్ లిస్టింగ్ నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్ కొనుగోలుపై ఏకంగా రూ.వెయ్యి 242 నష్టం వాటిల్లింది. ఇక ఐపీవో విషయానికి వస్తే కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.408 కోట్ల 80 లక్షలు సమీకరించింది. ఇందులో రూ.130 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా మిగిలిన భాగం ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వాటాల విక్రయం జరిగింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 46 షేర్లుగా ఉంచటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.14వేల 812 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. 

కంపెనీ వ్యాపారం..
కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్న గణేష్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. కంపెనీ మైదా, సుజీ, శనగపిండి, డాల్డా వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దీనికి తోడు స్పైసెస్, స్నాక్స్, రెడీమేడ్ ఫుడ్ మిక్సెస్ వంటి ఇతర ఉత్పత్తుల్లో కూడా ఉంది.