చెక్క చెదరని లంబోదరుడు

చెక్క చెదరని లంబోదరుడు

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్లాస్టర్‌‌‌‌ ఆఫ్ ప్యారిస్‌‌ వినాయకులే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల  మాత్రం ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. కానీ.. ఇక్కడ మాత్రం కర్ర వినాయకుడికి పూజలు చేస్తారు. మరి కర్ర వినాయకుడ్ని ఎలా నిమజ్జనం చేస్తారు అనుకుంటున్నారా? ఈ సత్య గణేశుడిని ప్రతిష్ఠించిన పదకొండో రోజు వాగు దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు చిలకరించి మళ్లీ తీసుకొచ్చి భద్రంగా బీరువాలో పెడతారు. మళ్లీ తర్వాతి సంవత్సరం  ఆ విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తారు. ఇది 71 సంవత్సరాలుగా  వస్తున్న ఆనవాయితీ.

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి గ్రామానికి దగ్గరలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది పాలాజ్ గ్రామం. ఇక్కడ 71 సంవత్సరాలుగా కర్ర వినాయకుడికి పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే టైంలో ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి లక్షల మంది వస్తుంటారు. విఘ్న నాయకుడికి పదకొండు రోజుల పాటు పూజలు చేస్తారు. పదకొండో రోజు ప్రత్యేకంగా తయారుచేసిన రథంలో విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ శోభాయాత్ర రెండు రోజులు చేస్తారు. రెండు రోజులపాటు జరిగే శోభాయాత్రలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఈ యాత్ర బాజా భజంత్రీల చప్పుళ్లతో ఎంతో వైభవంగా సాగుతుంది. తర్వాత దగ్గరలో ఉన్న వాగు దగ్గరకు రథాన్ని తీసుకెళ్లి విగ్రహం మీద వాగు నీళ్లను చల్లి తిరిగి తీసుకొస్తారు. ఆ విగ్రహాన్ని ఏడాదిపాటు బీరువాలో దాచిపెడతారు. అయితే ఈ విగ్రహంతో ఉంచే మట్టి వినాయకుడిని మాత్రం వాగులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఆలయంలో వినాయకుడి చిత్రపటం పెట్టి ఏడాదిపాటు పూజలు చేస్తారు. 71 సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీరుస్తున్న ఈ వినాయకుడిని ‘సత్య గణేశుడి’గా ఇక్కడివాళ్లు పిలుస్తుంటారు. ఇక్కడికి హైదరాబాద్‌‌‌‌తో పాటు నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి, మహారాష్ట్రలోని ముంబాయి, పుణె, ఔరంగాబాద్ నుంచి భక్తులు వచ్చి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు.

1948 నాటి సత్య గణేశుడు

అది 1948. పాలాజ్ గ్రామంలో ప్రజలకు రోగాలు వచ్చి బాధపడుతున్నారు. ఆ టైంలోనే చవితి పండుగ వచ్చింది. అప్పుడు గ్రామంలో ఒక పెద్ద మనిషికి వినాయకుడు కలలో కనిపించి ‘నా విగ్రహాన్ని కర్రతో చేసి ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీ కష్టాలు దూరమవుతాయి’ అని చెప్పాడట. దాంతో ఆ ఊరివాళ్లంతా కలిసి కర్ర వినాయకుడిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని నిర్మల్ పట్టణానికి చెందిన కళాకారుడు గుండాజి వద్దకు వెళ్లి కర్ర వినాయకుడిని తయారు చేయమని కోరారు. ఆయన 21 రోజుల పాటు నియమనిష్ఠలతో ఉండి ఈ కర్ర వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజలు చేశారు. ఆ తర్వాత ప్రజలకు రోగాలు నయమయ్యాయి. దాంతో అదే విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తున్నారు.

11రోజుల పాటు పనులు మానేసి..

వినాయక ఉత్సవాల టైంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ 11రోజులపాటు అన్ని పనులు మానేసి సత్య గణేశుడి సేవ చేస్తారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేయడం, తాగునీరు అందించడం, లడ్డూ ప్రసాదం పంచడం లాంటివి చేస్తుంటారు. ఆలయ కమిటీ కొన్ని కమిటీలు వేసి పనులు అప్పజెప్పుతుంది. అంతా కలిసికట్టుగా పనిచేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

సాంస్కృతిక కార్యక్రమాలు

నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ ప్రతిరోజు భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ జానపద, సినీ గాయనీ గాయకులతో, కమెడియన్లతో స్టేజీ షోలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జబర్దస్త్(ఈటీవీ) టీంతో ప్రదర్శన ఇప్పించనున్నారు. ఆలయంలో ఉదయం, రాత్రి ‘హారతి కార్యక్రమం’ ఉంటుంది. ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

ఎలా వెళ్లాలి

పాలాజ్.. భైంసా నుంచి 30 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. నిజామాబాద్ నుంచి వచ్చే భక్తులు బాసర మీదుగా బైంసాకు చేరుకుని అక్కడి నుంచి కుభీర్ గుండా మాలేగాం మీదుగా పల్సి గ్రామం నుంచి పాలాజ్ చేరుకోవచ్చు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి వచ్చే భక్తులు భైంసా మీదుగా పాలాజ్‌‌‌‌కు చేరుకోవచ్చు.
నాందేడ్ నుంచి వచ్చే భక్తులు కీనీ మీదుగా పాలాజ్‌‌‌‌కు చేరుకోవచ్చు. భైంసా ఆర్టీసీ డిపో నుంచి కొన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను పాలాజ్‌‌‌‌ కు నడుపుతున్నారు. ఆలయం వద్ద వాహనాలు  పార్కింగ్‌‌‌‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతిరోజు భక్తుల సేవలోనే

ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అందుకనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పదకొండు రోజులపాటు  ఊరు ఊరంతా భక్తుల సేవలోనే గడుపుతున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే కమిటీ లక్ష్యం.

– బందెల రఘువీర్,
ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు