భాగ్యనగరంలో బడా పండగ.. నేడే ఖైరతాబాద్​ గణేశ్ నిమజ్జనం

భాగ్యనగరంలో బడా పండగ.. నేడే ఖైరతాబాద్​ గణేశ్ నిమజ్జనం
  • దారులన్నీ హుస్సేన్​సాగర్​ వైపే

  • ఖైరతాబాద్, బాలాపూర్ ​వినాయకుల నిమజ్జనం ఇక్కడే

  • మధ్యాహ్నంలోపు గంగమ్మ ఒడికి బడా గణేశ్​

  • సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి

  • 73 చెరువులు, బేబీ పాండ్స్​ ఏర్పాటు

  • ఇప్పటికే లక్షన్నర విగ్రహాల నిమజ్జనం

  • వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు:హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద వేడుక వినాయక నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్​లో సుమారు 3 లక్షల​మండపాలు ఏర్పాటయ్యాయని గణేశ్​ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించింది. మండపాల కోసం సుమారు 40 వేల మంది నిర్వాహకులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​చేసుకున్నారు. మిగిలిన వారంతా అపార్ట్​మెంట్లలో, స్కూల్స్, కాలేజీలు, ప్రైవేట్​స్థలాల్లో ఏర్పాటు చేసుకున్నారు.

ఇందులో హుస్సేన్​సాగర్​తో పాటు సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు, మీర్​ఆలం ట్యాంక్, దుర్గం చెరువు, కాప్రా ఊర చెరువుతో కలిపి 73 చోట్ల ఏర్పాటు చేసిన బేబీపాండ్స్, పోర్ట్ టేబుల్, ఎస్కలేటివ్​పాండ్స్ లలో ఇప్పటికే సగం వరకు నిమజ్జనాలు పూర్తయ్యాయి. మిగిలిన విగ్రహాల నిమజ్జనం మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్టీసీ, ఆర్టీఏ, మెట్రో, ఎలక్ట్రిసిటీ, వాటర్​బోర్డ్​సహా అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. హుస్సేన్ సాగర్ లో గతేడాది 72 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది ఇప్పటివరకే 20 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మంగళవారం మరో 70 వేలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

24 గంటల పాటు...

మంగళవారం బల్దియా నుంచి 15 వేల మంది మూడు షిఫ్టుల్లో చెరువులు, పాండ్స్​వద్ద 24 గంటల పాటు సేవలందించనున్నారు. మహానగర వ్యాప్తంగా 468 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఒక్క హుస్సేన్​సాగర్​తీరంలోనే 35 క్రేన్లను ఏర్పాటు చేసి వేగంగా నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10 కంట్రోల్ రూముల్లో అడిషనల్ కమీషనర్ స్థాయి అధికారులు డ్యూటీలో ఉండనున్నారు. ఇటీవలి వర్షాలకు రోడ్లపై పడిన గుంతలను పూడ్చారు. శోభాయాత్రకు అడ్డు వచ్చే చెట్ల కొమ్మలు నరికివేశారు. టాంక్ బండ్, ఎన్టీఆర్​మార్గ్, నెక్లెస్​రోడ్​తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల వద్ద డెబ్రిస్​తొలగించేందుకు14 మోడ్రన్​మెషీన్లతో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తుల కోసం 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అర్ధరాత్రి రెండు గంటల వరకు రైళ్లను నడపనున్నట్టు మెట్రో ప్రకటించింది. బల్దియా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి టాంక్​బండ్​కు విగ్రహాలను తరలించేందుకు సుమారు 3వేల వాహనాలను అందుబాటులో ఉంచినట్టు ఆర్టీఏ ప్రకటించింది. వాటర్​బోర్డు ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 122 చోట్ల  వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.

బాలాపూర్​ గణేశుడి శోభాయాత్ర 21కి.మీ.

హుస్సేన్​సాగర్​కు సుమారు 21 కిలో మీటర్ల దూరం నుంచి తరలివచ్చే బాలాపూర్​ శోభాయాత్రే అది పెద్దది. ఇక్కడ జరిగే లడ్డూ వేలం పాటను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. వేలం తర్వాత మొదలయ్యే శోభాయాత్ర బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణ గుట్ట మీదుగా చార్మినార్‌‌‌‌, అఫ్జల్‌‌గంజ్, ఎంజే మార్కెట్‌‌, అబిడ్స్, బషీర్‌‌‌‌బాగ్‌‌, లిబర్టీ వై జంక్షన్‌‌ మీదుగా హుస్సేన్‌‌ సాగర్‌‌‌‌కు రాత్రి వరకు చేరుకోనుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన శోభాయాత్ర మార్గంలో 733 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  

బందోబస్తు ఇలా..

నిమజ్జనం ప్రశాంతంగా జరిపేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్​ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్​బాబు, అవినాశ్ మహంతి ఇదివరకే చర్చించారు. బందోబస్తు కోసం సుమారు 35 వేల మంది పోలీసులను నియమించారు. 25 వేల మంది ప్రధాన శోభాయాత్రలోనే డ్యూటీలు చేయనున్నారు. హుస్సేన్​సాగర్ చుట్టే 3 వేల మందిని మొహరించనున్నారు. 3,800 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 125 ప్లాటూన్స్‌‌ సెంట్రల్ ఫోర్సెస్​ను సిద్ధం చేశారు. ఐదు డ్రోన్‌‌ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌ మెగా స్క్రీన్ నుంచి పర్యవేక్షించనున్నారు. వీరే కాకుండా అవసరాన్ని బట్టి టాస్క్​ఫోర్స్, స్పెషల్​పార్టీ పోలీసుల సేవలు వినియోగించుకోనున్నారు. పోకిరీల పని పట్టేం దుకు 12 షీ టీమ్స్ బృందాలు పని చేయనున్నాయి. నిమజ్జనం టైంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 67 డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు అనుమతి లేదని ప్రకటించారు.

ఖైరతాబాద్​ బడా గణపతి నిమజ్జనమే కీలకం

అతి పెద్దదైన ఖైరతాబాద్ ​వినాయకుడి నిమజ్జనమే అధికారులకు పెద్ద టాస్క్​లా మారనుంది. ఈ మహా గణపతిని మధ్యాహ్నం రెండు గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు ప్లాన్​చేశారు. దీని కోసం మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకే గణనాథుడిని భారీ క్రేన్ ​మీదకు ఎక్కించి, సపోర్టింగ్​ వెల్డింగ్​పూర్తి చేశారు. ఉదయం ఆరు గంటలకే శోభాయాత్ర మొదలుకానుంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియెట్ మీదుగా మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనుంది. ప్రతిసారి లాగానే ఈ సారి కూడా ఎన్టీఆర్​ మార్గ్​లోని నాలుగో నంబర్​ క్రేన్​ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు.