బెదిరింపు కాల్స్ చేస్తూ నేరాలు.. ముఠా అరెస్ట్

 బెదిరింపు కాల్స్ చేస్తూ నేరాలు.. ముఠా అరెస్ట్

హైదరాబాద్: బెదిరింపు కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బున్న వారే కాదు.. అమాయకులపై ఫోకస్ చేయడం.. వారి వివరాలు, బలహీనతలన్నీ కనుక్కుని మీ అక్రమ వ్యవహారాలన్నీ మాకు తెలుసు.. అంటూ ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతారు. మీ వ్యవహారాలను వదిలెయ్యాలంటే డబ్బులివ్వమని డిమాండ్ చేస్తూ వసూలు చేస్తున్న నేరగాళ్ల ముఠాను పకడ్బందీగా పట్టుకున్నారు. డబ్బున్న చిన్న పిల్లల తల్లిదండ్రులపై కూడా ఫోకస్ చేసి కిడ్నాప్ చేస్తామని, యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించి మరీ డబ్బులు గుంజినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. 
ముఠాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టగా నిందితులు ఉప్పల్ లోనే ఉంటున్నట్లు గుర్తించారు. పోలీసు కమిషన్ మహేష్ భగవత్ కథనం ప్రకారం బెదిరింపు కాల్స్ చేస్తూ నేరాలకు పాలపడుతున్న యువకులు ముఠాగా ఏర్పడ్డారు. డబ్బులు ఎలా సంపాదించాలని ప్లాన్ వేసుకుని పథకం ప్రకారం అమలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే కోవలోనే వీరు ఇటీవల ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపు కాల్ చేశారు. అగంతకుల ఫోన్ .. వారు చెప్పిన వివరాలతో ఖంగుతున్న ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను వలపన్ని పట్లుకున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ముఠాపై గతంలో ఆలేరు, భువనగిరిలో ఇప్పటికే రెండు కేసులు నమోదైనట్లు గుర్తించారు. సందేపల్లి శంకర్ కుమార్, సింహాద్రి, సంగి జశ్వంత్ అనే ముగ్గురు ప్లాన్ ప్రకారం ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్టు చేసిన నిందితులను సీపీ మహేష్ భగత్ శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుల నుండి 3 కత్తులు, ఒక స్కూటీతోపాటు  4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.