జైశ్రీరాం అనాలంటూ ముస్లిం యువకుడిపై దాడి : కాపాడిన హిందూ జంట

జైశ్రీరాం అనాలంటూ ముస్లిం యువకుడిపై దాడి : కాపాడిన హిందూ జంట

ఔరంగాబాద్: జైశ్రీరాం అని జపించాలంటూ ఓ ముస్లిం యువకుడిపై కొంతమంది అగంతుకులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో శుక్రవారం జరిగింది. ఇమ్రాన్ ఇస్మాయిల్ పటేల్ అనే వ్యక్తి స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇమ్రాన్ శుక్రవారం తన పని ముగించుకొని ఇంటికి వస్తుండగా బేగమ్ పుర ప్రాంతంలోని హుడ్కో కార్నర్ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి జైశ్రీరాం అని జపించాలంటూ అతనిపై దాడి చేశారు.

స్థానికంగా నివసించే ఓ హిందూ జంట ఇమ్రాన్ అరుపులు విని తమ ఇంటి నుంచి బయటకు వచ్చి.. దుండగులు అతన్ని కొట్టకుండా అడ్డుకొని రక్షించారు. ఆ తర్వాత హిందూ జంట ఆ దుండగుల నుంచి ఇమ్రాన్ బైక్ తాళాలు తీసుకొని అతనికి ఇచ్చి సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడ్డారు. ఈ దాడి గురించి స్పందించడానికి ఆ హిందూ జంట ఒప్పుకోలేదని తెలుస్తోంది. స్థానిక ఇన్ స్పెక్టర్ మధుకర్ సావంత్ ఈ కేసును ఐపీసీ సెక్షన్ 153 ఎ మరియు సెక్షన్ 144ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

జైశ్రీరాం అనాలంటూ మైనారిటీ వర్గాలపై అక్కడక్కడా దాడుల వార్తలు బయటకొస్తున్న టైమ్ లో.. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.