ఆర్కెస్ట్రా సింగర్​పై గ్యాంగ్ రేప్

ఆర్కెస్ట్రా సింగర్​పై గ్యాంగ్ రేప్
  •  పెండ్లి వేడుకలో ప్రదర్శనకు పిలిచి అఘాయిత్యం
  • జార్ఖండ్​లోని పాలములో ఘటన

రాంచీ: ఆర్కెస్ట్రా గ్రూప్​లో పాటలు పాడే 21 ఏండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కూల్ డ్రింక్​లో మత్తుమందు కలిపి తాగించి, ఆపై ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. జార్ఖండ్​లోని పాలములో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్​లో స్పానిష్ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. 

ఇంట్లో ఆశ్రయం ఇచ్చి..

చత్తీస్​గఢ్​కు చెందిన 21 ఏండ్ల యువతి ఆర్కెస్ట్రా సింగర్. ప్రోగ్రాంలను బట్టి పలు ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్​లోని పాలముకు చెందిన ఆర్కెస్ట్రా బృందం నిర్వాహకుడు గోలు బాధితురాలిని పిలిపించాడు. ఓ పెండ్లి వేడుకలో ప్రోగ్రాం ఉందని చెప్పడంతో ఆ యువతి తన సోదరితో కలిసి ఆదివారం పాలముకు చేరుకుంది. తీరా ఆమె వచ్చాక ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పిన గోలు.. ఇద్దరికీ తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. 

అక్కాచెల్లెళ్లను చెరో గదిలో పడుకోమని చెప్పి కూల్​ డ్రింక్ ఇచ్చాడు. అది తాగాక తనను మత్తు ఆవరించిందని, ఆపై గోలుతో పాటు మరో ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తాను మత్తులో ఉన్నప్పటికీ మెలకువగానే ఉండటంతో నిందితులను గుర్తుపట్టానని తెలిపింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.