గ్యాంగ్​స్టర్​ అతీఖ్​కు జీవిత ఖైదు.. మరో ఇద్దరికి కూడా..

గ్యాంగ్​స్టర్​ అతీఖ్​కు జీవిత ఖైదు.. మరో ఇద్దరికి కూడా..
  •     ఉమేష్​పాల్​ కిడ్నాప్​ కేసులో ప్రయాగ్​రాజ్​ కోర్టు తీర్పు
  •     చెరో లక్ష చొప్పున జరిమానా 
  •     ఇంకో ఏడుగురు నిర్దోషులుగా విడుదల

ప్రయాగ్​రాజ్​ :  ఉమేష్​పాల్​ కిడ్నాప్​ కేసులో గ్యాంగ్​స్టర్​అతీఖ్​అహ్మద్, దినేశ్​ పాసీ, ఖాన్​ సౌలత్​హనీఫ్​లను యూపీలోని ప్రయాగ్ రాజ్​లో ఉన్న ఎంపీ‌‌‌‌–ఎమ్మెల్యే కోర్టు దోషులుగా తేల్చింది. ఆ ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. వారిపై చెరో రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. ఫైన్​ ద్వారా వారి నుంచి సేకరించే మొత్తాన్ని ఉమేష్​పాల్ కుటుంబానికి అందిస్తామని కోర్టు వెల్లడించింది.  ఐపీసీ 364–ఏ సెక్షన్​ కింద నేరాభియోగాలన్నీ నిరూపణ కావడంతో ముగ్గురికి కోర్టు జీవితఖైదు విధించిందని ప్రభుత్వ న్యాయవాది గులాబ్​ చంద్ర అగ్రహారి తెలిపారు.  

ఇక అతీఖ్​ అహ్మద్​ సోదరుడు అష్రఫ్​ సహా మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అతీఖ్ అహ్మద్​పై ఇప్పటివరకు 100కుపైగా పోలీసు కేసులు నమోదవగా.. వాటిలో అతడు దోషిగా తేలిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. కోర్టు తీర్పును ప్రకటించిన అనంతరం అతీఖ్​ అహ్మద్​ ను నైనీ  పట్టణంలోని జైలుకు తరలించారు. అక్కడ మీడియా ప్రతినిధులను చూసిన అతీఖ్.. ‘‘నాకు కోర్టులంటే గౌరవం.. ఇది తప్పుడు తీర్పు. నేను హైకోర్టుకు వెళ్తా” అని  చెప్పాడు. అంతకుముందు మంగళవారం ఉదయం  అతీఖ్​ను ప్రయాగ్ రాజ్ కోర్టుకు తీసుకురాగానే.. అతడికి ఉరిశిక్ష విధించాలంటూ కొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. 

2005 నుంచి ఇప్పటిదాకా.. 

2005లో  బీఎస్పీ ఎమ్మెల్యే  రాజుపాల్​ హత్య జరిగింది. ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్​ పాల్​ఉన్నాడు. 2006లో ఉమేష్​ పాల్​ కిడ్నాప్​ కు గురై విడుదలయ్యాడు. దీంతో 2007లో అతడు అతీఖ్​అహ్మద్ సహా పలువురిపై కిడ్నాప్​కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ సంబంధించిన చివరి రోజున (ఈ ఏడాది ఫిబ్రవరి 24న) ఉమేష్​ పాల్​ ప్రయాగ్​ రాజ్​లోని తన ఇంటి వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై ఉమేష్​ పాల్​ భార్య జయా పాల్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అతీఖ్​ అహ్మద్​, అతడి సోదరుడు అష్రఫ్​, అతీఖ్​ భార్య షాయిస్తా పర్వీన్​, అతీఖ్ ఇద్దరు కొడుకులతో పాటు మరో 11 మంది కలిసి తన భర్తను మర్డర్​ చేయించారని అభియోగాలు నమోదు చేసింది. 2007లో ఉమేష్ పాల్​పెట్టిన కిడ్నాప్​కేసు, ఇటీవల అతడి భార్య జయాపాల్​ నమోదు చేసిన మర్డర్​ కేసులను కలిపి విచారించిన ప్రయాగ్​ రాజ్ న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది.