గోల్డీ బ్రార్ గ్యాంగ్ స్టర్ కాదు.. టెర్రరిస్టు

గోల్డీ బ్రార్ గ్యాంగ్ స్టర్ కాదు.. టెర్రరిస్టు

కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.  గ్యాంగ్‌స్టర్ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది.  ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది.  

2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో  గోల్డీ బ్రార్‌ మాస్టర్ మైండ్ గా ఉన్నాడు.  ఈ హత్య తరువాత   గోల్డీ బ్రార్‌ మాకం మార్చాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ సహా దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. కాగా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం లఖ్ బీఆర్ సింగ్ లాండ్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఎవరీ గోల్డీ బ్రార్‌? 

గోల్డీ బ్రార్‌ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాల హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాల హత్య కేసులో అరెస్టయిన లారెన్స్‌ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పాటుగా పలువురికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.