గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ రిమాండ్‌ను 4 రోజులు పొడిగించిన ఢిల్లీ కోర్టు

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ రిమాండ్‌ను 4 రోజులు పొడిగించిన ఢిల్లీ కోర్టు

సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు ఎన్ఐఏ రిమాండ్ గడువును ఢిల్లీ కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కోణంపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. పది రోజుల రిమాండ్ అనంతరం ఈ రోజు లారెన్స్ బిష్ణోయ్‌ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచగా.. పటియాలా కోర్టు తాజాగా మరో 4 రోజుల రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అంతకుముందు పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ లో కాంట్రాక్ట్ హత్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా లారెన్స్ రిమాండ్ గడువును మరింత పెంచాలని ఎన్ఐఏ కోరింది. గ్యాంగ్‌స్టర్ రాజు తేత్‌ను సికార్ జిల్లాలోని అతని ఇంటి గేటు వద్ద నలుగురు వ్యక్తులు కాల్చి చంపారన్న ఎన్ఐఏ.. ఈ ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపింది. దాంతో పాటు సిద్ధూ మూసేవాలా కేసును దర్యాప్తు చేస్తున్నామని, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో గ్యాంగ్‌స్టర్లకు ఉన్న సంబంధాల కోణాన్ని పరిశీలిస్తున్నట్లు ఏజెన్సీ సమర్పించింది.