32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం

32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం

న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారం (జూన్ 4న) ఈ శిక్ష ప్రకటించింది.

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడైన అవదేశ్ రాయ్‌ను 1991 ఆగస్టు 3వ తేదీన వారణాసిలో అజయ్ నివాసం వద్ద కాల్చి చంపారు. దీనిపై ముఖ్తార్ అన్సారీతో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముఖ్తార్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించినట్టు న్యాయవాది ఒకరు వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 

కోర్టు తీర్పుపై అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాయ్ స్పందిస్తూ...  తీర్పుకోసం ఏళ్ల తరబడి తాము నిరీక్షించామని, ఇప్పటికి దీనికి ఒక ముగింపు వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తాను, తన తల్లిదండ్రులు, అవదేశ్ కుమార్ కుటుంబ సభ్యులంతా ఎంతో కాలంగా ఓపికగా ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వాలు రావడం, వెళ్లడంతో ముఖ్తార్ మరింత బలపడుతూ వచ్చారని అన్నారు. అయినప్పటికీ తాము నిరాశ పడలేదని, లాయర్ల కృషి కారణంగా తన సోదరుడి హత్య కేసులో కోర్టు ముఖ్తార్‌ను దోషిగా ప్రకటించిందని చెప్పారు.