గ్యాంగ్ స్టర్ పై కాల్పుల ఘటన: మెటల్ డిటెక్టర్లు పని చేస్తున్నాయా లేదా..?

గ్యాంగ్ స్టర్ పై కాల్పుల ఘటన:  మెటల్ డిటెక్టర్లు పని చేస్తున్నాయా లేదా..?

ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  గ్యాంగ్ స్టర్ జితేంద్ర గోగిని కోర్టులో హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. ఇదే టైంలో లాయర్ల డ్రెస్ లో వచ్చిన ఇద్దరు దుండగులు గోగిపై కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు కూడా చనిపోయారు. ఈ  ఇద్దరు టిల్లు గ్యాంగ్ కు చెందిన వారిగా గుర్తించారు. తీవ్ర గాయాలపలైన గోగిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. 2020లో వివిధ కేసుల కింద జితేంద్ర గోగిని అరెస్టు చేశారు ఢిల్లీ స్పెషల్ పోలీసులు.

జడ్జి విచారణ జరుపుతుండగానే  కాల్పులు జరిగాయి. ఆకస్మాత్తుగా లోపలికి వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఐతే కోర్టులో మెటల్ డిటెక్టర్లు పని చేస్తున్నాయా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. మెటల్ డిటెక్టర్లు పని చేస్తే ఇద్దరు దుండగులు ఆయుధాలతో లోపలికి ఎలా వచ్చారనేది కీలకంగా మారింది. 

జితేందర్ మన్ అలియాస్ గోగి ఢిల్లీలో పేరు మోసిన నేరస్తుడు. గోగి అతని అనుచరులు ఢిల్లీలో అనేక హత్యలు, హత్య యత్నాలు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 2016లో గోగిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఆ టైంలో గోగిపై 4 లక్షల రివార్డు ఉంది. తర్వాత 2018 లో వీరేందర్ మన్ అనే గ్యాంగ్ స్టర్ ను నడిరోడ్డుపై కాల్చిచంపడంతో మరోసారి వార్తాల్లోకి వచ్చాడు గోగి.  వీరేందర్ మన్ ఛాతిలోకి 20 బుల్లెట్లు కాల్చి చంపాడు గోగి. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఓ సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

జితేందర్ గోగి గ్యాంగ్, టిల్లు గ్యాంగ్ ల మధ్య దశాబ్ధాలుగా గొడవ నడుస్తోంది. 2010లో ఢిల్లీ యూనివర్శిటీ  స్టూడెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు గ్యాంగుల మధ్య వార్ స్టార్ట్ అయింది. ఆ టైంలో స్వామి శ్రద్ధానంద కాలేజ్ లో స్టూడెంట్ గా ఉన్నారు జితేందర్ గోగి. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ ఎన్నికల్లో గోగి స్నేహితుడు పోటీ  చేశాడు. సునీల్ అలియాస్ టిల్లు పోటీ నుంచి తప్పుకోవాలంటూ గోగి స్నేహితుడిపై దాడి  చేశాడు. దీంతో గోగి ఫ్రెండ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దశాబ్ధ కాలంగా రెండు గ్యాంగుల మధ్య జరిగిన అల్లర్లలో రెండు వైపులా 25 మంది దాకా చనిపోయారు.