కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అంటే అమ్మకం.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంటే నమ్మకం : గంగుల కమలాకర్

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అంటే అమ్మకం.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంటే నమ్మకం : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో, కోతలు పెట్టే కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని  మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, బహదూర్ ఖాన్ పేటతోపాటు సిటీలోని 41, 43 డివిజన్లలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు పొలాల వద్ద పడిగాపులు కాసి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయేవారని గుర్తు చేశారు. పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రోళ్లు కడుపు నిండా విషం పెట్టుకుని వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే అమ్మకం.. -బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీలు నమ్మి మోసపోవద్దన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా చామన్ పల్లికి వచ్చినప్పుడు రోడ్లు, తాగునీరు లేవని, ఈ పదేళ్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు.

1956లో మన తాతముత్తాతలు చేసిన తప్పుకు-50 ఏళ్లు దారిద్ర్యం అనుభవించామని, మళ్లీ ఆ తప్పు జరిగితే మన పోరగాళ్ల నోట్లో మన్ను కొట్టినట్లవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. 

కాంగ్రెస్ అభ్యర్థిపై 30 కబ్జా కేసులు

కాంగ్రెస్ అభ్యర్థిపై 30కి పైగా కేసులతో పాటు రౌడీషీట్​ ఉందని, ప్రజల భూములను కబ్జా చేసేందుకు ఆయన వస్తున్నాడని మంత్రి గంగుల ఆరోపించారు. కాంగ్రెస్  టిక్కెట్లు అమ్ముకుంటే రూ.5 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని విమర్శించారు.'బండి సంజయ్ ఎంపీగా గెలిచాక ఎప్పుడైనా కనిపించాడా.. మన కష్టాలు పట్టించుకున్నాడా' అని ప్రజలను ప్రశ్నించారు. ఎంపీగా గెలిపిస్తే  అభివృద్ధి కోసం రూపాయి తేలేదన్నారు. తాను మాత్రం మీ బిడ్డగా మీ మధ్యే ఉన్నానని గుర్తు చేశారు. మచ్చలేని తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు వేణు, ప్రసాద్ పాల్గొన్నారు. 

గంగులకు బీసీ సంఘాల మద్దతు

కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగులకు బీసీ సంఘాలు గురువారం మద్దతు ప్రకటించాయి.  బొమ్మకల్  గ్రామానికి చెందిన కురుమ సంఘం సభ్యులు, ఇతర పార్టీల లీడర్లు పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 

అవినీతికి పాల్పడ్డాడనే సంజయ్‌‌‌‌‌‌‌‌ను దించేసిండ్లు 

'అవినీతికి పాల్పడి, రూ.కోట్లకు కోట్లు సంపాదించవనే కదా బండి సంజయ్.. నిన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేశారు' అని మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  గంగుల మాట్లాడుతూ బండి సంజయ్​అవినీతి డబ్బు సంచులతో వచ్చి ఓటుకు రూ.20 వేలుకు ఇస్తాడని, ఆయన ఇచ్చేది అవినీతి సొమ్మేనని.. దానిని తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు రూ.లక్ష, రెండు లక్షలు ఇచ్చుకుంటు పోతున్నాడని, చిన్న ముల్లే కాదు.. పెద్ద ముల్లే విప్పాలని ప్రజలు డిమాండ్ చేయాలని సూచించారు.