మూడోసారి కూడా బండి సంజయ్ ఘోరంగా ఓడిపోతాడు: గంగుల కమలాకర్

 మూడోసారి కూడా బండి సంజయ్ ఘోరంగా ఓడిపోతాడు: గంగుల కమలాకర్

కరీంనగర్ లో బండి సంజయ్  మూడోసారి కూడా ఘోరంగా ఓడిపోతారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఇప్పటికే  ప్రజలు ఓటు ఎవరికి వేయాలో  నిర్ణయించుకున్నారని చెప్పారు.  అభివృద్ధి  కోసం ఎంపీగా నయా పైసా తీసుకురాని బండి సంజయ్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు.  

బండి సంజయ్ ఈసీ  నిబంధనలను తుంగలో తొక్కారని గంగుల ఆరోపించారు.  ప్రచారం గడువు ముగిశాక డబ్బు పంచడానికి వెళ్ళిందే బండి సంజయ్ అని అన్నారు.  డబ్బు పంచడానికి వెళ్లిన విషయం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయిందన్నారు.  అక్కడి ప్రజలు తిరగబడే సరికి బీఆర్ఎస్ డబ్బులు పంచుతోందని అరవడం మొదలు పెట్టారని గంగుల అన్నారు.  దీనిపై  భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ప్రమాణం చేస్తావా అని గంగుల సవాల్ విసిరారు.  తడి బట్టలతో ఇద్దరం వెళ్దామా.. తనతో  వస్తావా అని అని ప్రశ్నించారు.  

మద్యం, డబ్బులు పంచుతూ బండి సంజయ్ మనుషులే పట్టుబడ్డారని మంత్రి గంగుల ఆరోపించారు.  ఎమ్మెల్యే కాకముందే ఇంత గుండాయిజమా అని మండిపడ్డారు.  చేసిన అభివృద్ధి వివరించి ఓట్లు అడిగితే తప్పు లేదు కానీ ఇలా ఎన్నిసార్లు ప్రజలను మభ్య పెడతావని ప్రశ్నించారు.