కరీంనగర్ సిటీకి నిధుల వరద.. శంకుస్థాపనలతో మంత్రి గంగుల బిజీబిజీ

కరీంనగర్ సిటీకి నిధుల వరద.. శంకుస్థాపనలతో మంత్రి గంగుల బిజీబిజీ

కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ శనివారం కరీంనగర్ సిటీలో సుడిగాలి పర్యటన చేశారు. సీఎం అస్యూరెన్స్ గ్రాంట్స్ కింద విడుదలైన రూ.133 కోట్లతో చేపట్టబోయే పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఒక్క రోజే 8 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎస్ డబ్ల్యూజీ పైపులైన్ డ్రైవ్, మంచినీటి సరఫరా పనులకు భూమి పూజలు చేశారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ స్కీమ్​ కింద సుమారు వెయ్యి కోట్ల పనులు పూర్తి చేయగా.. అక్కడక్కడ మిగిలిపోయిన డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, పైప్ లైన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సీఎం అస్యూరెన్స్ గ్రాంట్స్ కింద విడుదలైన రూ.133 కోట్లను వినియోగిస్తున్నారు. ఈ నిధులతో 166 వర్క్స్ సింగిల్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కు అప్పగించారు. సీఎంఏ గ్రాంట్స్ తో సిటీలో పలు చోట్ల మిగిలిపోయిన పెండింగ్ పనులకు మోక్షం లభించినట్లయింది. ఈ పనులు పూర్తయితే కరీంనగర్ సిటీలో ఎక్కడా మట్టి రోడ్లు కనిపించబోవని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

ప్రారంభించిన పనులు ఇవే.. 

మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి శనివారం తొలుత 9 వ డివిజన్ కోతిరాంపూర్ లో కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ తో కలిసి సీసీ రోడ్డు, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, మంచి నీటి పైపులైన్ పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం 10,11,32 డివిజన్ల లో పెండింగ్ రోడ్లు, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, మంచి నీటి పైపులైన్ పనులతో పాటు కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్లు మర్రి బావి సతీశ్​, కాసర్ల ఆనంద్, ఆకుల నర్మద నర్సమ్మతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. 

46,48,49 డివిజన్లకు సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ వంగల శ్రీదేవి, దుర్శేడు అనూప్ కుమార్, కమల్ జిత్ కౌర్ సౌహాన్ సింగ్ తో కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైపులైన్ పనులకు భూమి పూజ చేశారు. మరో వైపు 21వ డివిజన్ సీతారాంపూర్ విలీన గ్రామ డివిజన్ లో కార్పొరేటర్ జంగిలి సాగర్ తో కలిసి సీసీ రోడ్లు ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, మంచి నీటి పైపు లైన్ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అంతకు ముందు 30 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 42 వేల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. 

ఎంతో అభివృద్ధి చేసుకున్నాం: మేయర్ సునీల్ రావు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేగా మంత్రి గంగులను మరోసారి గెలిపించుకుందామని మేయర్ సునీల్ రావు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సహకారంతో కరీంనగర్ సిటీని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, అభివృద్ధి యజ్ఞం కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మళ్లీ ఆశీర్వదించండి : మంత్రి గంగుల కమలాకర్

ప్రపంచ స్థాయి పర్యాటకులను అకర్షించేలా నగరాన్ని అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చుతామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ ప్రజల రుణాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు తెలిపారు. 

సీఎం కేసీఆర్ సహకారంతో నగరంలో 1000 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటి వరకు నగరంలో 220 కిలోమీటర్ల రోడ్లను నిర్మించామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో ఏడాదిలోగా మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మరోసారి ఆశీర్వదించి, అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలో కరీంనగర్ సిటీ గుంతల రోడ్లతో, చెత్తాచెదారంతో ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ సిటీ స్వచ్ఛతతో అభివృద్ధి బాట పట్టిందన్నారు.