తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాలి : గంగుల కమలాకర్

తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాలి :  గంగుల కమలాకర్
  • కాంగ్రెస్​కు ఓటేస్తే కరెంట్​ కష్టాలు  తప్పవు
  • బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే వృథా 

కొత్తపల్లి, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని, అందుకు కర్నాటక పరిస్థితులే నిదర్శనమని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్య అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్​ఎస్ ప్రభుత్వమే రావాలని, సమైక్య పాలనలో ఆంధ్రోళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండేవారని, తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వక అరిగోస పడ్డామని గుర్తుచేశారు. తలాపున గోదావరి పారినా, తెలంగాణ భూములకు చుక్కనీరు రాకపోయేదన్నారు. వర్షాకాలంలో సైతం ఎల్ఎండీ ఎడారిని తలపించేదన్నారు.

సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డామని పొలానికి, నీరు పెట్టేందుకు, కరెంట్ కోసం రైతులు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు కాసేవారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో కరీంనగర్​ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశానన్నారు.1956లో మన తాతలు చేసిన తప్పుతో పచ్చని తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఇప్పుడు పచ్చని తెలంగాణను చూస్తే ఆంధ్రోళ్లకు కండ్లు మండుతున్నాయని, అందుకే అందరూ కూడబలుక్కోని తెలంగాణను దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేరుతో కిరణ్​కుమార్​రెడ్డి వస్తే.. చిచ్చు పెట్టమని చంద్రబాబు.. పవన్​కళ్యాణ్​ను పంపించాడని, షర్మిల, కేవీపీ కాంగ్రెస్ ముసుగులో హైదరాబాద్‌‌‌‌లో అడ్డావేశారని, తెలంగాణ ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోతే మనల్ని బతుకనివ్వరని, సంక్షేమ పథకాలు ఎత్తేసి గుడ్డి దీపం చేస్తారని ఆవేదన వ్యక్తంచేశారు.  

తప్పు జరిగితే మళ్లీ నలభై, యాభై ఏళ్ల దారిద్య్రం చూస్తామని, కాంగ్రెస్​, బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీకి వేసినట్టేనన్నారు. కేసీఆర్​ లేని తెలంగాణ లేదని, సీఎంగా కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేమన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే వృథా అవుతుందని, బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా కనిపించాడా అని ప్రశ్నించారు. 'నేను మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను.. మరోసారి ఆశీర్వదిస్తే గొప్పగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణ - రవీందర్, సర్పంచ్ మంజుల - సమ్మయ్య, ఎంపీటీసీలు పట్టెం శారద, లక్ష్మీనారాయణ, తిరుపతినాయక్, నాయకులు జయ ప్రకాశ్‌‌‌‌, పిల్లి మహేశ్‌‌‌‌, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌‌‌‌లోకి చేరికలు 

కరీంనగర్ టౌన్,వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో  కుల సంఘ నాయకులు, వాకర్స్ నాయకులు, సభ్యులు బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు. సోమవారం స్థానిక మీసేవ ఆఫీస్ లో ఎస్సారార్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచకొండ చక్రధర్ రావు, పృథ్వీధర్ రావు, 18,19వ డివిజన్ రేకుర్తి మడలేశ్వర స్వామి సంక్షేమ సంఘం బాధ్యులు, కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ ఎస్సీ కాలనీ యువకులు పార్టీలో చేరారు. మంత్రి గంగుల వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.