ఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల

ఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల

కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. దేశ ప్రజల ఒత్తిడి మేరకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిందని గంగుల స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని అన్నారు. 

స్వరాష్ట్రం ఏర్పడక ముందు అరిగోస పడ్డామని, బొంబాయి, దుబాయ్ వలస పోయే పరిస్థితి ఉండేదని గంగుల అన్నారు. సాగు నీరు లేక వేల ఎకరాలు బీళ్లుగా మారాయాని, సాగు, తాగు నీటి కోసం జిల్లాల మధ్య యుద్ధాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే ఉండేది కాదని అన్నారు. గతంలో రాష్ట్ర వనరుల్ని దోచుకున్న ఆంధ్రా పార్టీలు ఇప్పుడు వైఎస్ షర్మిల, చంద్రబాబు, కేఏ పాల్ రూపంలో మళ్లీ వస్తున్నాయని విమర్శించారు. మరోసారి ఆంధ్రా పాలన వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ధ్వంసం చేసి నీటిని దోచుకుపోతారని గంగుల ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం ఇంటి పార్టీ టీఆర్ఎస్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.