
- వారం రోజుల్లో మూడు చోట్ల సరుకు సీజ్
- హైదరాబాద్ నుంచి రవాణా చేస్తున్న స్మగ్లర్లు
జూన్ 30న మహబూబ్‌నగర్ జిల్లా మాచారం ఫ్లై ఓవర్ వద్ద ఎక్సైజ్ ఆఫీసర్లు నిర్వహించిన దాడుల్లో ఎండు గంజాయిని అమ్ముతున్న ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 4న ముందస్తు సమాచారం మేరకు జడ్చర్లలోని ఓ కాలనీలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆ కాలనీలోని ఓ ఇంట్లో 1.3 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ప్యాకెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
మహబూబ్‌నగర్/పాలమూరు/జడ్చర్ల, వెలుగు : పాలమూరు జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. యూత్, లేబర్ టార్గెట్‌గా దందా నడుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా, పక్క ప్లాన్ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన టాన్స్ పోర్టర్ల ద్వారా మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాలకు సరుకు తెప్పిస్తున్నారు. అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్లలో ప్రధాన కూడళ్లు, పాన్ సెంటర్ల వద్ద యధేచ్చగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఎక్కువగా యూత్ గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. కాలేజీ స్టూడెంట్లను టార్గెట్ చేసుకొని డీలర్లు అమ్మకాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
చిన్న పాకెట్లలో ప్యాక్ చేసిన గంజాయిని గ్రాము రూ.50కి అమ్ముతున్నారని సమాచారం. జడ్చర్ల ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండగా గంజాయి డీలర్లు అక్కడ లేబర్‌కు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి పరిశ్రమల్లో బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఏపీ, కర్నాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి వలస వచ్చిన వారు పనిచేస్తున్నారు. బాలానగర్ మండలం మోతీఘనపూర్గ్రామంలో యూపీకి చెందిన ఇద్దరు కొంత కాలంగా గుడిసె వేసుకొని ఉంటున్నారు. వీరు ఆ ప్రాంతంలోని కంపెనీల్లో పని చేసే కూలీలకు గంజాయిని అమ్మారు. ఈ విషయం తెలిసి రెండునెలల కింద ఎక్సైజ్అధికారులు వారిని పట్టుకొని కేసు పెట్టారు. ఈ మండలంలో గంజాయి రవాణా చేస్తున్న మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్, ఒడిశా నుంచి స్మగ్లింగ్
హైదరాబాద్‌లోని ధూల్ పేట, ఒడిశా స్టేట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు స్మగ్లర్లు సరుకు తెప్పిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పేందుకు నేరుగా సరుకు తేవడంలేదు. స్థానికులతో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని మీడియేటర్లుగా పెట్టుకుని మధ్యలో రెండు, మూడు చోట్ల వ్యక్తులను మారుస్తూ సరుకు తెప్పిస్తున్నారు. కొంతకాలం కిందటివరకు పట్టణాలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పల్లెల్లో కూడా దొరుకుతుంది. ఈ మహమ్మారి గ్రామాలకు కూడా పాకడంతో గంజాయి రవాణను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఒడిశా, గోవా, ఏపీ స్టేట్ పోలీసుల సహకారం తీసుకుంటోంది.
ఇందులో భాగంగా 'ఈగల్' (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్‌లా ఎన్ఫోర్స్మెంట్)ను పటిష్టం చేస్తోంది. ఆ రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ఐ సహకారంతో జాయింట్ ఆపరేషన్లు చేపడుతోంది.
స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం
గంజాయి నిర్మూలనకు జిల్లాలో స్పెషల్ టీమ్స్ఏర్పాటు చేశాం. హైదరాబాద్ లోని ధూల్ పేట నుంచి బీహార్‌కు చెందిన కొంతమంది ఇక్కడికి గంజాయి సప్లై చేస్తున్నారు. వారి మీద ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రగ్స్ పై ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలను పసిగట్టేందుకు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ను అందబాటులోకి తెచ్చాం.
వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్