గచ్చిబౌలి,వెలుగు: ఏపీ నుంచి సిటీకి బస్సులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన గొలి కుమారస్వామి(20), మల్లవరం గ్రామానికి చెందిన జొన్నస్వామి(20) ఇద్దరూ ఫ్రెండ్స్. వీరు నర్సీపట్నంలోని ఐటీఐ కాలేజీలో కొంతకాలం చదివి.. మధ్యలోనే మానేశారు.
ఆ తర్వాత కూలి పనిచేయడం మొదలుపెట్టారు. ఆదాయం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని స్కెచ్ వేశారు. గతేడాది జూన్ లో 180 కిలోల ఎండు గంజాయిని తమిళనాడుకు ట్రాన్స్ పోర్టు చేస్తుండగా పత్తిపాడు వద్ద పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారు. 9 నెలల పాటు జైలులో ఉండి ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చారు. మళ్లీ గంజాయి అమ్మాలని ప్లాన్ చేశారు. లంబసింగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గంజాయి సప్లయర్ లక్ష్మణ్ రావుతో పరిచయం పెంచుకున్నారు. నర్సీపట్నం నుంచి గంజాయి, హాష్ ఆయిల్ ను హైదరాబాద్ కు ట్రాన్స్ పోర్టు చేయాలని లక్ష్మణ్ రావు వీరికి చెప్పాడు.
ప్రైవేటు వెహికల్స్, కార్లలో వెళ్తే పోలీసుల చెకింగ్ ఉంటుందని భావించిన లక్ష్మణరావు.. వారిని బస్సులో పంపించాడు. 28 కిలోల గంజాయి, 3 లీటర్ల హాష్ ఆయిల్ ను తీసుకుని కుమారస్వామి, జొన్నస్వామి ఈ నెల 26న నర్సీపట్నం నుంచి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామన సిటీకి చేరుకున్నారు. ఆరాంఘర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కుమారస్వామి, జొన్నస్వామిని రాజేంద్రనగర్ ఎస్ వోటీ, మైలార్ దేవ్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి గంజాయి, హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
గంజాయి సప్లయర్స్ పీడీ యాక్ట్
షాద్ నగర్: ఇద్దరు గంజాయి సప్లయర్స్ పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. మహారాష్ట్రకు చెందిన బాబా సోచందేకర్, తిరుమలి బాబు,గణేశ్, రాజేంద్ర వైజాగ్ లోని సీలేరు నుంచి రూ.3 వేలకు కిలో చొప్పున 214 కిలోల గంజాయి కొని సిటీ మీదుగా తరలించేందుకు స్కెచ్ వేశారు. గతేడాది జనవరి 17న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు గంజాయిని తరలిస్తున్న ఈ నలుగురిని రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 19న గణేశ్ పై పీడీ యాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు పంపారు. మరో నిందితుడు తిరుమలి బాబు ఈ ఏడాది ఫిబ్రవరి 14న మృతి చెందాడు. మిగతా ఇద్దరు నిందితులు బాబా సోచందేకర్, రాజేంద్రపై పోలీసులు సోమవారం పీడీ యాక్ట్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు.
