గంజాయి దొంగ అరెస్టు

గంజాయి దొంగ అరెస్టు

కంది, వెలుగు : కోర్టు హాలు లో భద్రపరిచిన కేసు ప్రాపర్టీ అయిన గంజాయి సంచిని దొంగిలించిన వ్యక్తిని మంగళవారం సంగారెడ్డి టౌన్​ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. కేసు వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రమేశ్​కుమార్​ తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి టౌన్​లో నివాసముండే షేక్ మహబూబ్(50) ఓ ఫైనాన్స్ యజమాని వద్ద కలక్షన్ లేబర్​గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సంగారెడ్డి టౌన్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు అతడు జామీన్​ ఇచ్చాడు. నిందితులు కోర్టు సమయంలో  కోర్టుకు రానందున షేక్​ మహబూబ్​కు కోర్టు రూ.30వేలు జరిమానా వేసింది. 

ఆ డబ్బులు ఈ నెల16న కట్టాల్సి ఉండగా, డబ్బులు లేకపోవడంతో -కోర్టు హాలులో భద్రపరిచిన గంజాయిని దొంగిలించాడు. విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలుపగా ఈ నెల 19న కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ నాయక్ సంగారెడ్డి టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఇన్​స్పెక్టర్ శీధర్ రెడ్డి ఘనటనా స్థలాన్ని పరిశీలించారు. 

షూ మార్క్స్, సీసీ టీవీ ఫూటేజ్​ఆధారంగా నిందితుడు షేక్ మహబూబ్​ను మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి దొంగలించిన గంజాయి సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడిడిని రిమాండ్​కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.