
- 698 కేజీల గాంజాతో పాటు ఆరుగురు అరెస్ట్
- భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు వెల్లడి
భద్రాద్రికొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు : గంజాయిని పార్సిల్స్ గా మార్చి తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎస్పీ బి. రోహిత్శనివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలోని సీలేరు నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు పార్సిల్ గా చేసుకుని ఐచర్ వ్యాన్‌లో గంజాయిని తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా 698 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ దాదాపు రూ. 3.49కోట్లు ఉంటుంది.
వ్యాన్‌లోని ముగ్గురు వ్యక్తులతో పాటు దాన్ని కారులో వెంబడించే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. హర్యానా చెందిన నిందితులు సందీప్‌కుమార్, లక్విందర్, అమర్నాథ్, పవన్‌కుమార్, రాజ్‌కుమార్, కృష్ణన్ కుమార్ అరెస్ట్ చేశారు. గంజాయి కొనుగోలు చేసిన, అమ్మిన వ్యక్తులు హరిఖారా, ప్రిన్స్కుమార్పై కేసులు నమోదు చేశారు. భారీగా గంజాయిని పట్టుకున్న టేకులపల్లి సీఐ టి. సురేష్, ఎస్ఐ ఎ. రాజేందర్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రమాకాంత్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, రామారావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.